భారత సైనికులకు త్వరలో అత్యాధునిక గన్‌లు

భారత సైనికులకు త్వరలో అత్యాధునిక గన్‌లు
భారత సైనికులకు త్వరలో అత్యాధునిక గన్‌లు అందనున్నాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్టెర్లింగ్‌ కార్బైన్‌ల స్థానంలో ఈ కొత్త గన్‌లను సైన్యం ఇవ్వనున్నది. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ (సిక్యుబి) కార్బైన్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త అత్యాధునిక గన్‌ల తయారీ కోసం సైన్యం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ), భారత్ ఫోర్జ్ లిమిటెడ్‌లకు ఆర్డర్ ఇచ్చింది. 
 
ఆర్మీ రూ.2వేలకోట్ల విలువైన ఒప్పందానికి సంబంధించి డీఆర్డీవో, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ ఎల్‌-1 బిడ్డర్స్‌గా ఎంపికయ్యాయి. 5.56×45 ఎంఎం సిక్యుబి కార్బైన్‌ను డీఆర్డీవో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎఆర్ డిఇ), భారత్ ఫోర్జ్ లిమిటెడ్ రూపొందించాయి. ఈ కార్బైన్‌ను భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అయిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు చెందిన పుణే యూనిట్లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. 
 
భారత సైన్యం ప్రస్తుతం 1940లో రూపొందించిన సబ్-మెషిన్ గన్ అయిన స్టెర్లింగ్ కార్బైన్‌ను ఉపయోగిస్తోంది. సైన్యం చాలా కాలంగా స్టెర్లింగ్ కార్బైన్‌ను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులకు స్టెర్లింగ్ కార్బైన్ సరిపోతదని సైన్యం భావించింది. ఈ క్రమంలోనే చాలారోజుల నుంచి క్లోజ్‌ క్వార్టర్‌ బ్యాటిల్‌ కార్బైన్స్‌ కోసం ప్రయత్నిస్తున్నది.
 
పూణేలోని డీఆర్డీవో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎఆర్ డిఇ) కొత్త కార్బైన్‌ను రూపొందించాలని నిర్ణయించుకుంది. 5.56×45 ఎంఎం సిక్యూబి కార్బైన్ చిన్న, తేలికపాటి కార్బైన్‌ కావడంతో ఎన్‌కౌంటర్లలో ఖచ్చితమైన ప్రతిస్పందన ఇవ్వనుండగా, ఇందులో అనేక ఆధునిక ఫీచర్స్‌ ఉన్నాయి. ఆప్టిక్స్‌, లేజర్‌ డిజిగ్నేటర్స్‌ తదితర యాక్సెసరీస్‌ డిజైన్‌ల ఇన్‌స్టాల్‌ చేయబడి ఉంటాయి. ఈ డీల్‌లో దాదాపు 4లక్షలకుపైగా గన్స్‌ తయారు చేసి సైన్యానికి అందించనున్నట్లు తెలుస్తున్నది.