విమానయాన రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తెర లేచింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ విమానం గాల్లోకి ఎగిరింది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా నలుగురు ప్రయాణికులతో టేకాఫ్ అయిన ఈ విమానం సురక్షితంగా గమ్యస్థానంలో ల్యాండ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ విమానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చాలా తక్కువ ధరకే ప్రయాణికులకు సేవలు అందించనుంది.
ఇందులో మరో విశేషం ఏంటంటే కొంత దూరాన్ని ప్రయాణించేందుకు హెలికాప్టర్‌కు అయ్యే ఇంధనం ఖర్చు కంటే తక్కువలోనే ఈ ఎలక్ట్రిక్ విమానం ప్రయాణించింది. విమాన టికెట్ల ధరలు అంత ఎక్కువగా ఉండటానికి కారణం దాని ఇంధనం, నిర్వహణకు భారీగా ఖర్చు కావడమే. ఇక ప్రస్తుతం వాహనాల రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. స్కూటీ, బైక్ దగ్గరి నుంచి.. ట్రక్కులు, బస్సులు, రైళ్ల వరకు అన్ని వాహనాలు రోజురోజుకూ ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ విమానం అందుబాటులోకి వచ్చి ఎయిర్‌లైన్ చరిత్రలోనే సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్ అనే కంపెనీ విమానయానరంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని రూపొందించి, విజయవంతంగా నడిపింది. ‘ఆలియా సీఎక్స్ 300’ అనే పేరున్న ఈ విమానాన్ని అమెరికాలోని ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెన్నడీ విమానాశ్రయం వరకూ నలుగురు ప్రయాణికులతో ఇటీవలే నడిపించి చూశారు.
ఈస్ట్ హ్యాంప్టన్ నుంచి కెన్నడీ ఎయిర్‌పోర్టు వరకూ మధ్య దూరం 70 నాటికల్ మైళ్లు (130 కి.మీలు). ఈ దూరాన్ని ఆలియా 30 నిమిషాల్లో అధిగమించింది. దీనికైన ఖర్చు 8 డాలర్లు (రూ.694) మాత్రమే. అంటే, కిలోమీటరుకు ఐదు రూపాయల 30 పైసలు. సాధారణంగా ఈ దూరానికి ఒక హెలికాప్టరులో ప్రయాణిస్తే కనీసం 160 డాలర్లు (రూ.13,885) అవుతుందని, దాంట్లో 20వ వంతు ఖర్చుతోనే ఈవీ విమానంలో వెళ్లటం సాధ్యమైందని బీటా టెక్నాలజీస్ సీఈఓ కేల్ క్లార్క్ వెల్లడించారు.
విమానం లోపల ఎటువంటి శబ్దం ఉండదని, కాబట్టి, ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా చాలా సులువవుతుందని తెలిపారు. ఈ ఏడాదిలోపు ఆలియా సీఎక్స్కు అమెరికా ‘ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ గుర్తింపు తెచ్చుకోవాలని బీటీ టెక్నాలజీస్ ప్రయత్నాలు చేస్తోంది. ఆలియాలో ఒకసారి చార్జింగ్ చేస్తే 250 నాటికల్ మైళ్ల దూరం (463 కి.మీ) ప్రయాణించవచ్చని, స్వల్పదూర ప్రయాణాలకు ఈ తరహా విమానాలు సరిపోతాయని క్లార్క్ తెలిపారు.
2028లో అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగే ఒలింపిక్స్‌లో.. క్రీడాభిమానులు నగరంలోని ట్రాఫిక్ చిక్కుల బారిన పడకుండా ఎయిర్ ట్యాక్సీలను నడిపేందుకు ఒలింపిక్స్ కమిటీ ఆర్చర్ ఏవియేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
More Stories
క్వాల్కమ్ సీఈఓతో ఏఐ, ఇన్నోవేషన్‌పై ప్రధాని చర్చ!
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్