
* ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై మళ్లీ దాడి
కాగా, ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల్లో ఉన్న ఫోర్డో భూగర్భ అణు కేంద్రంపై సోమవారం మరోసారి దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొన్నది. యురేనియం శుద్దికి చెందిన ఫోర్డో అణు కేంద్రంలో భారీ నష్టం జరిగి ఉంటుందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. భూగర్భ అణు కేంద్రంపై రెండు రోజుల క్రితం అమెరికా బీ2 బాంబర్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. బంకర్ బస్టర్ బాంబర్లతో ఆ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశారు.
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ ఆర్మీ ప్రతినిధి తీవ్రంగా ఖండిస్తూ తమపై జరిపిన దురాక్రమణకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు. “గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసింది. దాని ఫలితం అనుభవించక తప్పదు. అమెరికాపై మరింత శక్తిమంతమైన చర్యలకు పాల్పడతాం. మా దేశంపై చేసిన దాడికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు” అని స్పష్టం చేశారు.
తమ అణుస్థావరాలపై దాడులు చేసినందుకు అమెరికా, ఇజ్రాయెల్‌లకు తగిన గుణపాఠం చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అమెరికాకు గట్టి సమాధానం ఇస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇలా ఉండగా, అమెరికా కన్నుగప్పి 400 కేజీల శుద్ధిచేసిన యురేనియంను ఇరాన్ దాచేసింది. తమ ప్రధాన అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేయడానికి ముందే ఇరాన్ యురేనియం తరలింపు పని పూర్తి చేసింది.
ఇరాన్ తన భవిష్యత్ అవసరాల కోసం మోతాదుకు మించి యురేనియంను శుద్ధి చేసింది. ఇదే ఇజ్రాయెల్, అమెరికాలకు కంటగింపుగా మారింది. ఇదే మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఘర్షణలకు దారి తీసింది. అయితే అమెరికా పకడ్బందీగా ఇంత భారీస్థాయిలో దాడి చేసినా, ఆ శుద్ధి చేసిన యురేనియం జాడను కనిపెట్టలేకపోయింది.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్