ఇరాన్ పై భారత బరాక్‌ క్షిపణి వ్యవస్థను ప్రయోగించిన ఇజ్రాయెల్‌

ఇరాన్ పై భారత బరాక్‌ క్షిపణి వ్యవస్థను ప్రయోగించిన ఇజ్రాయెల్‌

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన అత్యాధునిక బరాక్ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం ఉపయోగించింది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ స్పేస్‌లోకి దూసుకొచ్చిన ఇరాన్ యూఏవీలను బరాక్ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా కూల్చివేసినట్లు ఓ ప్రకటనలో ఇజ్రాయెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ స్పేస్‌లోకి దూసుకొచ్చిన ఇరాన్ యూఏవీలను బరాక్ రక్షణ వ్యవస్థతో సమర్థంగా కూల్చివేసినట్టు వెల్లడించింది.

దీంతో అత్యాధునిక బరాక్ గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌పై మొదటిసారిగా ఉపయోగించినట్లయ్యింది. యూఏవీలు, క్రూయిజ్ క్షిపణులు, ఇతర వైమానిక ముప్పుల నుంచి రక్షణ కోసం బరాక్-8 వ్యవస్థను భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ-డీఆర్డీఓతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. ఇందులో డ్యూయల్-ఫేజ్ రాకెట్ మోటార్ వంటి కీలకమైన భాగాలను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో బరాక్‌ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రయోగించిన ఫతా-II క్షిపణిని ఈ రక్షణ వ్యవస్థ అడ్డగించినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన బరాక్ వ్యవస్థ హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని కూల్చివేయగలదని తెలుస్తోంది. 

బరాక్ ఎయిర్‌ డిఫెన్స్‌తో ఎలాంటి వైమానిక దాడినైనా తిప్పికొట్టవచ్చని ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌, క్రూయిజ్ మిస్సైళ్లు, సీ టు సీ మిస్సైల్స్‌, రాకెట్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను బ‌రాక్ వ్యవస్థ చిత్తు చేస్తుందని పేర్కొన్నాయి. ఇది 30, 70, 150 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుందని ఇంతకు ముందు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌- ఐఏఐ తెలిపింది.