గోసంరక్షణలో సీఎం రేవంత్ కు విశ్వహిందూ పరిషత్ మద్దతు

గోసంరక్షణలో సీఎం రేవంత్ కు విశ్వహిందూ పరిషత్ మద్దతు
భారతీయ సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం గుర్తిస్తూ, హిందువుల మనోభావాలను గౌరవిస్తూ గో సంరక్షణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్  స్వాగతించింది.  గో సంపతి కాపాడేందుకు, గో సంరక్షణకు ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని సీఎం పేర్కొనడంతో  పరిషత్ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, గోరక్ష విభాగం ప్రాంత ప్రముఖ్ ఇసంపల్లి వెంకన్న, సహ ప్రముఖ్ రమేష్ హర్షం వ్యక్తం చేశారు. 
 
గో సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, అందుకు తగ్గ విధివిధానాలను రూపొందించేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. అయితే ఇది మాటలకే పరిమితం కాకుండా ఆచరణ రూపం దాల్చాలని వారు సూచించారు. గో సంరక్షణ కోసం పరితపిస్తున్న  గో ప్రేమికులతో రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం కావాలని కోరారు. 
 
ప్రస్తుతం మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న గోసంరక్షణ ప్రక్రియను అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని నాగపూర్ లో గల దేవులపారులోని గో విజ్ఞాన కేంద్రం సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రఖ్యాతిగాంచిన వేములవాడ రాజన్న గోశాలకు వంద ఎకరాలు కేటాయించాలని ఇటీవల విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసిందని పేర్కొంటూ ఆ డిమాండ్ ఆధారంగా ముఖ్యమంత్రి 100 ఎకరాలు తగ్గకుండా వేములవాడ గోశాలకు స్థలం కేటాయించడం శుభ పరిణామం అని  పేర్కొన్నారు.
 
అదేవిధంగా కేవలం బక్రీద్ సందర్భంగా మాత్రమే కాకుండా ప్రతినిత్యం గోరక్ష చట్టాలు అమలు చేసేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే విషయంలో ఇటీవల తాము రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని కలిసి గోరక్ష చట్టాలు కఠినంగా అమలు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. వేములవాడ, యాదగిరిగుట్ట, ఎనికేపల్లి, అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ప్రత్యేకంగా నాలుగు అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా ఏర్పాటు చేసే గోషాలలకు విరివిగా నిధులు కేటాయించాలని సూచించారు. 
 
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల భూముల్లో గోశాలలో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి  మండల, తాలూకా, జిల్లా స్థాయిలలో పేరు మోసిన దేవాలయాలు ఉన్నాయని.. వాటికి అనుసంధానంగా గోశాలలను నిర్మించాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గో ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తే కుటీర పరిశ్రమ, గ్రామీణ రైతాంగం ఆర్థికంగా నిలబడతారని సూచించారు. వ్యవసాయానికి, గ్రామీణ భారతానికి గోవు వెన్నెముకని, అదేవిధంగా హిందువుల ఆరాధ్య దైవం అని చెబుతూ గోవును కాపాడడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు.