
తెలంగాణాలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు. పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావులతో కూడిన కమిటీ ఈ విషయంలో లోతైన అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు.
మన సంస్కృతీలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా తొలుత రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో ఆధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సిఎం సూచించారు. ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలో విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలని సిఎం సూచించారు.
భక్తులు అత్యధిక భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపర్చాలని సిఎం సూచించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని సిఎం తెలిపారు. గోవుల సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని సిఎం స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్‌ను అధికారులు సిఎంకు అందజేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి