ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైన వేళ కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సులో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన అమెరికాకు పయనమయ్యారు. అత్యవసరంగా భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వచ్చీరాగానే భద్రతా మండలి సమావేశంలో పాల్గొననున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.
ఈ విషయాన్ని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జీ7 సదస్సులో ట్రంప్ చర్చలు జరిపారని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో కీలక ఒప్పందం చేసుకున్నట్లు లీవట్ వెల్లడించారు. ఇక ట్రంప్ కూడా జీ7 సభ్య దేశాల నేతలతో గ్రూప్ ఫొటో దిగిన తర్వాత అత్యవసరంగా తిరిగి వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ స్పందిస్తూ ట్రంప్ వెనుదిరగడం సరైన నిర్ణయమే అని చెప్పారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ముగించాలని జీ7 నేతలు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ఇరాన్‌కు సమయం మించిపోలేదని, అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు.
ఈ సందర్భంగా అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందాన్ని అంగీకరించాల్సి ఉండాల్సిందని వ్యాఖ్యనించారు. కెనడా నుంచే ఇరాన్‌కు కీలక హెచ్చరికలు జారీచేసిన ట్రంప్, తక్షణమే టెహ్రాన్‌ను అంతా ఖాళీ చేయాలంటూ సామాజిక మధ్యమంలో పోస్టు చేశారు. మొదట ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై స్పందించేందుకు నిరాకరించిన ఆయన, కొద్దిసేపటికే సామాజిక మధ్యమంలో ఇరాన్‌కు హెచ్చరికలు చేసి అమెరికా బయలుదేరివెళ్లారు.
మరో ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆయన కుటుంబం టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని ఒక బంకర్‌లో దాక్కొన్నారని తెలిసింది. యురేనియాన్ని శుద్ధి చేసుకొనే కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసేందుకు ఖమేనీకి ఇజ్రాయెల్ చివరి అవకాశమిచ్చిందని, అందువల్లే దాడులు జరిగిన మొదటి రోజైన శుక్రవారం రాత్రి ఆయనను హత్య చేయకుండా వదిలేసిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి. ఇజ్రాయెల్‌లోని కీలక నగరం టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ సోమవారం వందకి పైగా క్షిపణులతో దాడులు చేసింది.
టెల్ అవీవ్, ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాతో పాటు ఇతర నగరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. టెల్ అవీవ్ అంతటా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పెద్దఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని పవర్‌గ్రిడ్ దెబ్బతింది. హైఫాలోని రిఫైనరీపైనా ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి.
ఇజ్రాయెల్ కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న ఇరాన్ అధికారిక టీవీ- ఐఆర్ఐబి కార్యాలయంపైనా ఇజ్రాయెల్ క్షిపణి పడింది. ఓ మహిళా యాంకర్ వార్తల ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే స్టూడియోపై దాడి జరిగింది. ప్రాణభయంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ ఘటనతో ఐఆర్ఐబి తన ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. టెహ్రాన్‌లో టివి స్టూడియోలు ఉన్న ప్రాంతాన్ని ఖాళీచేయాలని అంతకు గంటముందే ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొంది.
ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో మూడో వంతు నాశనం చేశామని తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధ్రువీకరించారు. యుద్ధవిమానాలతో ఇరాన్ అణు కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తామని తెలిపారు. టెహ్రాన్ గగనతలంపై తాము పూర్తిగా నియంత్రణ సాధించడం ఈ యుద్ధంలో కీలక మలుపని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని చెప్పారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!