ఫార్ములా ఈ రేస్‌ లో మంత్రివర్గం ఆమోదం లేకుండా చెల్లింపులు!

ఫార్ములా ఈ రేస్‌ లో మంత్రివర్గం ఆమోదం లేకుండా చెల్లింపులు!
 
* 8 గంటల పాటు కేటీఆర్ పై ఎసిబి ప్రశ్నల వర్షం 
 
‘‘ఫార్ములా ఈ కార్‌ రేస్‌ నిర్వహణకు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధుల చెల్లింపులు ఎందుకు చేశారు? రేసు నిర్వహణ నుంచి మధ్యలో తప్పుకొన్న ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ మీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.49 కోట్లు ఎందుకు చెల్లించింది? ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో మీరు అధికారులకు నేరుగా (మౌఖిక) ఆదేశాలు ఎలా ఇచ్చారు? విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘించారు?’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
సుమారు 8 గంటల పాటు సాగిన విచారణలో వారు ఆయన్ను 60 దాకా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్‌ దర్యాప్తు అధికారుల ఎదుట రెండోసారి విచారణకు సోమవారం హాజరయ్యారు. గతంలో విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్‌ను ప్రశ్నించిన అధికారులు.. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలు, ఈ కేసులో ఎఫ్‌ఈవో కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన పత్రాలు, సమాచారం ఆధారంగా ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి, మరింత లోతుగా విచారించి, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.
అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు కేటీఆర్ కు తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను అరెస్ట్ చేస్తే చేసుకోండని ఏసీబీ అధికారులకు చెప్పానని, అదే చేసి ఉంటే జైల్లో విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు.  ఇలా తనపై వందల కొద్దీ కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడేది లేదని కేటీఆర్‌ తేల్చి చెప్పారు.

విచారణ సమయంలో కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేశారు. ఇవాళ సెల్ఫోన్ తీసుకురాలేదని విచారణ అధికారులకు కేటీఆర్ చెప్పారు. ఈ-రేసింగ్ సమయంలో వాడిన సెల్ఫోన్లు అప్పగించాలని ఆయనకు సూచించింది. ఈనెల 18 లోపు రేసు సమయంలో వాడిన సెల్ఫోన్లు అప్పగించాలని ఏసీబీ ఆదేశించింది. రేవంత్‌ రెడ్డి జైలుకెళ్లినందుకు తమను కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. తమను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 “ఈ ఫార్ములా కార్‌ రేస్‌పై చర్చ పెట్టాలని అడిగితే రేవంత్‌రెడ్డి పారిపోయిండు. ఫార్ములా-ఈ రేస్‌పై నేనేదో తప్పు చేసిన.. కేసీఆర్‌ ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని అంటున్నవ్‌ కదా.. దమ్ముంటే చర్చ పెట్టు అని అసెంబ్లీలో పట్టుపడితే పారిపోయిండు. నాలుగు గోడల మధ్యల ఎందుకు.. నాలుగు కోట్ల మంది ముందు మాట్లాడుదామంటే పారిపోయిండు. అవసరమైతే లై డిటెక్టర్‌ పరీక్ష చేయించుకుంటా.. నువ్వు కూడా రా అంటే పత్తా లేడు” అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.