ఈ నెల 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యోగా దినోత్సవం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సోమవారం విశాఖలో సమీక్ష నిర్వహిస్తూ ఈ వేడుకలను ‘యోగఆంధ్ర–2025’ పేరుతో ప్రత్యేకంగా బ్రాండింగ్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను యోగా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు.
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26.5 కిలోమీటర్ల బీచ్ రోడ్‌ను యోగా వేడుకలకు వేదికగా ఎంపిక చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విశాఖపట్నంలో కనీసం 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంటూ ఘనతతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
“యోగా ద్వారా గిన్నిస్ రికార్డుతో పాటుగా సుమారుగా 22 రికార్డులు నమోదు చేయబోతున్నాం. వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశాం. ప్రస్తుతం వర్షం వచ్చేందుకు ఆస్కారం లేదు. సెంట్రల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా చేయాలని ఆలోచన చేస్తున్నాo. యోగాని సమర్థవంతంగా, నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమం తదనంతరం కూడా యోగాని కొనసాగిస్తాం” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
భద్రత పరంగా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోందని సీఎం తెలిపారు. మొత్తం 8 వేల మంది పోలీసు సిబ్బంది, 1,200 సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నియంత్రణ చేపట్టాలని సూచించారు. వర్షం వంటి అనుకోని పరిస్థితులకు ముందస్తు ప్రణాళికగా ఎయు ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌ను ప్రత్యామ్నాయ వేదికగా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమానికి పాల్గొనదలచిన వారు క్యూఆర్ కోడ్ ఆధారిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకోవచ్చని, లైవ్ మానిటరింగ్ కోసం ప్రత్యేక డిజిటల్ మాడ్యూల్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల గమనాన్ని సమన్వయం చేయడానికి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ను సజావుగా నడిపేందుకు క్యూఆర్ బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేయాలని తెలిపారు.
ఈ మార్గాన్ని మొత్తం 127 సెగ్మెంట్లుగా విభజించి, ప్రతి సెగ్మెంట్‌కు ప్రత్యేకాధికారులను నియమించాలని సూచించారు. వాలంటీర్లు, వైద్య సదుపాయాలు, లైఫ్ గార్డులు, ట్రాన్సపోర్ట్ లింకులు వంటి అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టంగా ఆదేశించారు. యోగా డేలో నేవీ 11 యుద్ధ నౌకలను ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.

More Stories
ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు
ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?