
తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో 2026, అక్టోబర్ 1 నుంచి, రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణనను చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ సారి జనగణనతోపాటు కుల గణననూ చేపడుతున్నారు.
ఇందుకోసం మొత్తం 34లక్షల మంది గణకులు, సూపర్‌వైజర్లు, 1.34లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు.
డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది. సెక్షన్ 3, జనగణన చట్టం, 1948 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు వివరించింది. దేశంలో జనగణనను పదేండ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియను చేపట్టారు. రెండు విడుతల్లో ఈ ప్రక్రియ జరిగింది.
వాస్తవానికి 2021లోనే జన గణనను నిర్వహించాలి. అయితే, కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే, ఇప్పుడు 16 ఏండ్ల తర్వాత తొలిసారిగా జనాభా గణనను నిర్వహించనున్నారు. దీంతోపాటు తొలిసారిగా కులగణనను కూడా చేపట్టనున్నారు. కాగా జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అందులో ఓ కొత్త ప్రశ్న కూడా ఉంది. అదే ఈ జనగణన ప్రత్యేకత.
దేశంలో 1872 నుంచి జనగణన చేస్తున్నారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1931 నుంచి ఒకే విధమైన ప్రశ్నలే అడుగుతూ వస్తున్నారు. అయితే 1951 నుంచి ఇప్పటి వరకు అడగని ఒక ప్రశ్న ఈసారి జనగణనలో అడుగుతారు. అదే మీ కులం ఏంటి? అని. ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గురించి సమాచారం ఇంతకు ముందే ఉంది. అయితే ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరికీ తమ కులం గురించి చెప్పే ఆప్షన్ ఉంటుంది. 1931 తర్వాత ఇప్పుడు జనగణన, కులగణనను ఒకేసారి చేపడుతున్నారు.
More Stories
జమ్ముకశ్మీర్‌లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!