అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి లక్షలాది జనం

అమెరికాలో ట్రంప్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి లక్షలాది జనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 79వ జన్మదినం వేళ నిరసనలతో అమెరికా అట్టుడికింది. ట్రంప్‌ వ్యతిరేకులతో శనివారం అమెరికా వీధులు, పార్క్‌లు నిండిపోయాయి. ప్రదర్శనకారులు పెద్ద ఎత్తున గుమికూడి ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దాదాపు 2 వేల చోట్ల ‘నో కింగ్స్‌’ ప్రదర్శనలు జరిగాయి.  డౌన్‌టౌన్‌లు, చిన్న పట్టణాలు గుండా కవాతు చేస్తూ ప్రజాస్వామ్యం, వలసదారుల హక్కులను పరిరక్షించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
 ‘నో కింగ్స్‌’ పేరిట దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల్లో లక్షలాది మంది ప్రజానీకం పాల్గొంటున్నారు. ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నవారు కూడా ఇప్పుడు ‘నో కింగ్స్‌’ ఉద్యమంలో భాగస్వాములు కావడంతో నిరసనలు మరింత ఉధృతంగా సాగుతున్నాయి.  లాస్ ఏంజెలిస్‌లో ఇటీవల వలసదార్లపై ట్రంప్ అధికార యంత్రాంగం అణచివేతలు, ఈ క్రమంలో అక్కడికి ట్రంప్ నేరుగా తమ జాతీయ రక్షణ దళాలను పంపించడం, స్థానిక పోలీసు బలగాలతో నిమిత్తం లేకుండా వారు బందోబస్తుకు దిగడం వంటి పరిణామాలు క్రమేపీ వలసదార్ల నుంచి నిరసనలకు దారితీశాయి.
ఇక్కడ రాజులెవరూ లేరనే పోస్టర్లతో న్యూయార్క్, డెన్వెర్, చికాగో, ఆస్టిన్, లాస్ ఎంజెలిస్, అట్లాంటా ఇతర ప్రాంతాలలో వేలాదిగా జనం తరలివచ్చి, ట్రంప్ వ్యతిరేక నినాదాలకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.  కొన్ని రాష్ట్రాలలో డెమోక్రాటిక్ గవర్నర్లు ఉండటంతో జాతీయ స్థాయి భద్రతా బలగాలకు స్థానికంగా సరైన సహకారం అందడం లేదు. పలు ప్రాంతాలలో వందలాదిగా రోడ్డు పక్క సమావేశాలు జరుగుతున్నాయి. దేశం ఎటువెళ్లుతోంది. ఇది ప్రజాస్వామ్యమా? నియంత్రత్వమా? అని ప్రశ్నిస్తూ జనం రోడ్లపైకి వస్తున్నారు.
నో కింగ్స్ బ్యానర్‌పై ఇప్పుడు అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ఉద్యమం మరింత ఉధృతం అయ్యే పరిస్థితి నెలకొంటోంది.  పలు ప్రాంతాలలో జనం గుమికూడటంతో పార్క్‌లు, వీధులు, ప్లాజాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రశాంతంగానే నిరసనలు సాగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, వలసదారుల హక్కులను కాపాడాలని, నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ, మేం రాజులను అంగీకరించమని నినాదాలు చేశారు.
పౌరుల స్వేచ్ఛ కీలకం అని , అమెరికా స్వేచ్ఛా స్వాతంత్య్ర అంతర్లీనతకు భంగం వాటిల్లితే, దీనికి అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని సాకుగా చేసుకుంటే సహించేది లేదని ప్రదర్శనకారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ పౌరులదే రాజ్యం, రాజులు ఎవరూ లేరని నినాదాలు మిన్నంటుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు సాగుతూ ఉన్నా, ఇవి ఎక్కువగా క్రమశిక్షణాయుతంగానే ఉండటం, ఘర్షణలకు తావులేకపోవడంతో ఈ నో కింగ్స్ నిర్వాహకులు అత్యంత వ్యూహాత్మక రీతిలోనే తమ ఉద్యమాన్ని బలోపేతం చేసుకుని వెళ్లే వీలుందని పరిశీలకులు తెలిపారు.

ఇక ఈ ప్రదర్శనల దశలోనే ట్రంప్ దేశ సైన్యం 250వ వార్షికతోత్సవం నేపథ్యంలో వాషింగ్టన్‌లో జరిగే సైనిక కవాతు లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ రోజే ట్రంప్ జన్మదినం కూడా కావడంతో ఆయన అభిమానులు తరలివచ్చారు. ఇక్కడ కూడా భద్రతా వలయాలను బేఖాతరు చేస్తూ నిరసనకారలు గుమికూడారు. వాషింగ్టన్‌లోని లోగాన్ సర్కిల్‌లో నిరసనకారులు ట్రంప్ వెళ్లిపోవాలని నినాదాలకు దిగారు. దీనితో ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. 

ఇక నిరసనకారుల గుంపు ట్రంప్ భారీ బొమ్మను పట్టుకుని ముందుకు కదిలారు. కిరీటం ధరించి ఉన్న ట్రంప్ బంగారపు టాయ్‌లెట్ పై కూర్చుని ఉన్న వ్యంగ్యచిత్రాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ఓ వైపు అమెరికా జండాలు పంచిపెడుతూ , జాతీయతను చాటుకుంటూ వారి నిరసనలు సాగాయి. వర్జీనియా, లాస్‌వేగాస్ , మేరీలాండ్ ఇతర ప్రాంతాల్లోనూ నిరసనకారులతో వీధులు మార్మోగాయి.

అమెరికాలోని ప్రసిద్ధ నగరాలన్నీ ట్రంప్‌ వ్యతిరేక నిరసన గళాలతో మార్మోగాయి. న్యూయార్క్‌, డెన్వర్‌, చికాగో, ఆస్టిన్‌, లాస్‌ ఏంజిల్స్‌లో భారీ ర్యాలీలు జరిగాయి. సీటెల్‌లో 70,000 మందికి పైగా పాల్గొన్నట్లు అంచనా. ఆట్లాంటాలోనూ వేలాది మందితో ప్రదర్శన సాగింది. ‘నో కింగ్స్‌’ పేరిట పెద్దపెద్ద బ్యానర్లు ప్రదర్శిస్తూ అమెరికా, మెక్సికో జెండాలు చేబట్టి ఆందోళనకారలు ఉత్సాహంగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.

పోర్ట్‌లాండ్‌లోని ఇమ్మిగ్రేషన్‌ భవనం వద్ద పోలీసులు టియర్‌ గ్యాస్‌, ప్రొజెక్టైల్స్‌ ఉపయోగించారు. యూటాలోని సాల్ట్‌ లేక్‌ సిటీలో నిరసన సందర్భంగా చోటు చేసుకున్న కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడగా, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు.