
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో దాదాపు 27.2 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు. యునెస్కోకు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానటరింగ్ టీం (జెమ్) ఈ మేరకు అంచనా వేసింది. గత ఏడాది వేసిన అంచనా కంటే ఇది 2.1 కోట్ల మంది ఎక్కువ కావడం గమనార్హం. బడికి దూరంగా ఉన్న చిన్నారుల సంఖ్య భారీగా పెరగడంపై నివేదిక రెండు కారణాలను ముఖ్యంగా పేర్కొంది.
ఒకటి నూతన నమోదు, హాజరు డేటాను పరిగణనలోకి తీసుకోవడం, రెండోవది ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం అక్కడి బాలికల విద్యపై నిషేధం విధించడం. ఐరాస నియమాల ప్రకారం ఆరు నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగినవారిని బడికి వెళ్లే వయస్సు వారుగా వర్గీకరిస్తారు. ఐరాస నవీకరించిన జనాభా అంచనాలు కారణంగా ఈ చిన్నారుల సంఖ్య భారీగా పెరిగిందని నివేదిక తెలిపింది.
అలాగే, తాము వెల్లడించిన సంఖ్య కంటే బడికి దూరంగా ఉంటే చిన్నారుల సంఖ్య ఇంకా అధికంగా ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంఘర్షణల వాతావరణం నెలకుందని, ఇలాంటి వాతావరణం కారణంగా వాస్తవమైన డేటా సేకరణకు అంతరాయం కలుగుతుందని నివేదిక పేర్కొంది.
అలాగే బడికి బయట ఉన్న చిన్నారులపై సంఘర్షణల వాతావారణం ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని తెలిపింది. ఏదేమైనా సరే ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల వయస్సు పిల్లల్లో 11 శాతం (దాదాపు 7.8 కోట్లు మంది), లోయర్ సెకండరీ పాఠశాల వయస్సు చిన్నారుల్లో 15 శాత మంది (6.4 కోట్లు), ఉన్నత పాఠశాల వయస్సు చిన్నారుల్లో 31 శాతం (దాదాపు 13 కోట్ల మంది) చిన్నారులు బడికి దూరంగా ఉన్నారని నివేదిక తెలిపింది.
వివిధ దేశాలు తమ జాతీయ లక్ష్యాలను సాధించడంలో విఫలమైతే ఈ సంఖ్య పెరుగుదల కొనసాగుతూనే ఉంటుందని, ఒకవేళ దేశాలు తమ లక్ష్యాలను సాధించగలిగితే 2030 నాటికి బడికి దూరంగా ఉన్న చిన్నారుల సంఖ్యను 16.5 కోట్లకు తగ్గించవచ్చునని నివేదిక పేర్కొంది.
More Stories
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం