
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇంద్రాయణి నదిపై గల పురాతన ఐరన్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడినట్టు పుణె జిల్లా మావల్ తహసీల్ అధికారులు తెలిపారు. ఇక్కడి కుండ్మాల గ్రామం సమీపంలో నదిపైన ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు వంతెన కూలిపోయినట్టు చెప్పారు.
కుప్పకూలిన వంతెన శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశామని, సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, గ్రామస్తులు, విపత్తు సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని అధికారి ఒకరు తెలిపారు. పర్యాటక ప్రాంతమైన కుందమలకు నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇంద్రయాని నదిని దాటేందుకు వంతెనను నిర్మించారు. ఇటీవల రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వంతెన దెబ్బతిన్నట్లుగా తెలుస్తున్నది.
ఈ వంతెన కూలిపోవడంతో పర్యాటకులు నదిలో పడి కొట్టుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. కాగా, సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో ఫోన్ లో మాట్లాడి ఈ ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే తగు సహాయ చర్యలు చేపట్టామని ఆదేశించారు.
ఈ దుర్ఘటన పట్ల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. కనీసం 38 మందిని ప్రమాదం నుంచి రక్షించామని, తీవ్రంగా గాయపడ్డ 18 మందిని వేర్వేరు దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు జిల్లా అధికారి ఒకరు చెప్పారు. వంతెన వద్దకు వందలాది మంది చేరుకుంటున్నా, అక్కడ పోలీసుల పర్యవేక్షణ లేకపోవటం ప్రమాదానికి దారితీసిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై విచారణ జరుపుతామని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ చెప్పారు.
పురాతన వంతెన తుప్పు పట్టిందని, కొత్త వంతెన నిర్మాణ ప్రణాళికకు ఓకే చేశామని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున సహాయాన్ని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రకటించారు. బాధితులు అందరికి పూర్తి వైద్య సహాయం అందించగలమని చెప్పారు. ఇంద్రాయణి నదిపై ఈ ఇనుప వంతెనను 30 ఏళ్ల క్రితం నిర్మించినట్లు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. ఇది కేవలం కాలినడక మార్గమే అని, ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 100 మంది ఉన్నారని చెప్పారు. ఆదివారం కావడం వల్ల పెద్ద సంఖ్యలో కుండమలకు వచ్చిన పర్యాటకుల్లో పలువురు వంతెనపైకి చేరుకున్న సమయంలో ప్రమాదం జరిగింది.
More Stories
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం