మధ్యప్రదేశ్‌ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతం!

మధ్యప్రదేశ్‌ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతం!

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు మహిళా మావోలు ఉన్నారు. నక్సల్ ప్రభావిత బిత్లి పోలీస్ అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని పచామా దాదర్ దట్టమైన అడవిలో శనివారం ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. 

పోలీసులు, హాక్‌ ఫోర్స్‌ సంయుక్త బృందం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఎన్‌కౌంటర్‌ జరిగింది. నక్సల్స్‌ నుంచి పెద్దమొత్తంలో మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు పచామా దాదర్ దట్టమైన అడవుల్లో మావోల కదలికలపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. 

దాంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ సమయంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో భద్రతా బలగాలు సైతం తిరిగి కాల్పులు జరుపడంతో నలుగురు మావోలు మరణించారు. మావోయిస్టుల నుంచి గ్రెనేడ్‌ లాంచర్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, నాలుగు రైఫిల్స్‌, ఇతర ఆయుధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

చనిపోయిన వారంతా జీఆర్‌బీ (గోందియా-రాజ్‌నంద్‌గావ్‌-బాలాఘాట్‌)కు చెందిన వారని ఎస్సీ ఆదిత్య మిశ్రా తెలిపారు. ఎన్‌కౌంటర్ తర్వాత సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు ఎస్సీ పేర్కొన్నారు. ఇంకా అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల బాలాఘాట్‌ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య మిశ్రా మిషన్‌-2026లో భాగంగా మావోల నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్హాలోని సూప్‌ఖర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళా నక్సల్స్‌ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆశా, షీలా, రంజిత, లఖ్ఖే మరావి ఉన్నారు. నలుగురిపై రూ.62లక్షల రివార్డు ఉంది.