విమాన ప్రమాదస్థలిని పరిశీలించిన మోదీ

విమాన ప్రమాదస్థలిని పరిశీలించిన మోదీ
 

గుజరాత్​ అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.  అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్‌ సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు మోదీ. విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. 

త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  రమేశ్‌ విశ్వాస్‌ కుమార్‌ బుచర్వాడను కూడా ప్రధాని పరామర్శించారు.  అతని  ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అతడికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స గురించి అక్కడి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్‌ సంఘవి తదితరులు ఉన్నారు. మరోవైపు ప్రమాద స్థలాన్ని ఎయిర్‌ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ కూడా పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.

విమానంలో ప్రయాణీకుల కుటుంబాల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్, ముంబై, డిల్లీ, గాట్విక్ విమానాశ్రయాలలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. మృతుల కుటుంబ సభ్యులు సభ్యుల అహ్మదాబాద్‌కు సకాలంలో చేరుకోవడానికి ఈ కేంద్రాల సహాయాన్ని తీసుకోవచ్చని వెల్లడించింది.

కాగా, ప్రమాద స్థలంలో శిథిలాలను తొలగించే ఆపరేషన్ రాత్రంతా కొనసాగింది.  ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ – ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదానికి కారణం ఇంకా అస్పష్టంగా ఉన్నందున, అహ్మదాబాద్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన లండన్ గాట్విక్‌కు వెళ్లే విమానం చివరి క్షణాలను బాగా అర్థం చేసుకోవడానికి బ్లాక్ బాక్స్ తిరిగి పొందడం చాలా కీలకం.

 
మరోవంక, ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత దారుణమైన విమాన దుర్ఘటనలలో ఒకటైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై భారతదేశం అధికారిక దర్యాప్తు ప్రారంభించిన తర్వాత, దర్యాప్తుకు మద్దతుగా అమెరికా, బ్రిటిష్ దర్యాప్తు బృందాలు రెండూ మోహరించాయి. యుఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తమ భారతీయ సహచరులకు సహాయం చేయడానికి పరిశోధకులను పంపుతామని ప్రకటించింది.  బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ యుకె దర్యాప్తు బృందాన్ని పంపినట్లు ధృవీకరించారు.