
* విమాన ప్రమాదంపై ఏఏఐబీ, డీజీసీఏ దర్యాప్తు .. నేడే ప్రధాని పర్యటన
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 297కు పెరిగింది. విమానాయన సంస్థ ఎయిరిండియా ఏఐ 171 విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ధ్రువీకరించింది. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మృతుల్లో 229 మంది ప్రయాణికులు ఉండగా, 12 మంది సిబ్బంది అని ప్రకటించింది. ఆసుపత్రి భవనంపై విమానం కూలడంతో మరో 56 మంది మృతి చెందారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) రంగంలోకి దిగిందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఏఏఐబీ డీజీ, ఇతర అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సమీక్ష నిర్వహించారు. అటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కూడా ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించింది.
ప్రమాదానికి కారణాలింకా తెలియరాలేదని పేర్కొంది. కెప్టెన్ సుమిత్ సభర్వాల్‌కు 8,200గంటలు, కోపైలట్‌కు 1,100 గంటల మేర విమానాలను నడిపిన అనుభవం ఉందని వివరించింది. అహ్మదాబాద్ విమానాశ్రయంలోని రన్‌వే 23 నుంచి విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపట్లోనే విమానం కూలిపోయినట్లు వివరించింది. పైలట్ ‘మేడే కాల్’ ఇచ్చిన కాసేపటికే ఏటీసీ సిబ్బంది మార్గదర్శనం చేస్తుండగా సిగ్నల్స్ తెగిపోయాయని వెల్లడించింది.
ఈ ప్రమాదంపై సమాచారం కోసం హాట్‌లైన్ నంబర్ 1800- 5691444నుఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత విమానాశ్రయంలో సేవలను నిలిపివేశామని, సాయంత్రం 4 గంటల సమయంలో పునరుద్ధరించినట్లు వెల్లడించింది. పౌరవిమానయాన సంస్థ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. విమాన ప్రమాదంపై దర్యాప్తునకు భారత అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎ్‌ఫఏఏ) తెలిపింది.
నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీబోర్డు బృందాలు దర్యాప్తునకు సహకరిస్తాయని పేర్కొంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్స్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని ఎయిర్ ఇండియా అందిస్తుందని వెల్లడించారు. గాయపడ్డ వారి వైద్య ఖర్చులను భరించనున్నట్లు వెల్లడించారు. అవసరమైన మద్దతు అందేలా చూస్తామని చెప్పారు. జేబీ మెడికల్ ఆసుపత్రి హాస్టల్‌ను నిర్మించి ఇస్తామని తెలిపారు.
ప్రమాదం విషయం తెలియగానే విజయవాడ నుంచి బయలుదేరానని, ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరాలు అడిగారని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడుతెలిపారు. విమాన ప్రయాణికుల్లో చిన్నారులు కూడా ఉన్నారని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని, విమాన ప్రమాద బాధ్యులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు.
కాగా, ఈ విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కరు బయటపడినట్లు అహ్మదాబాద్ సిపి తెలిపారు. 11ఎ నెంబర్ సీటులోని ప్రయాణికుడు 38 ఏళ్ల రమేశ్ విశ్వకుమార్ అనే వ్యక్తి ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన ఇతడికి బ్రిటన్ పౌరసత్వం ఉంది.
భారత్‌లో ఉంటున్న తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అతడు ఇటీవల ఇక్కడి వచ్చాడు. తిరిగి లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కాడు. అతడు తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ సోదరుడి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. ట్రాఫిక్‌లో చిక్కుకుని విమానాశ్రయానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడమే ఓ మహిళకు వరమైంది. ఎయిరిండియా విమానాన్ని ఎక్కలేకపోవడంతో ఆమె ప్రాణాలతో మిగిలింది. ఇలా 10 నిమిషాల ఆలస్యం భూమి చౌహాన్ అనే మహిళ ప్రాణాన్ని నిలబెట్టింది.
విమాన ప్రమాద మృతులను గుర్తుపట్టేందుకు బి.జె మెడికల్ ఆస్పత్రిలో అధికారులు డిఎన్ఎ పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. విమాన ప్రమాదంలో తమ వారుంటే కుటుంబసభ్యులు వచ్చి డిఎన్ఎ నమూనాలు అందజేయాలని గుజరాత్ ఆరోగ్యశాఖ కార్యదర్శి ధనంజయ్ ద్వివేది విజ్ఞప్తి చేశారు.
మరోవైపు విమానం బీజే ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ కూలడంతో మృతుల సంఖ్య ఎక్కువైంది. ఈ ఘటన సమయంలో వైద్య విద్యార్థులు భోజనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా విమానం వచ్చి కూలడంతో హాస్టల్‌లో పలువురు అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం. ఆ ప్రాంతంలోని నివాసితులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 50 మందిని అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్‌కు తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం