రైతులను నట్టేట ముంచిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులను నట్టేట ముంచిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం
గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన వల్ల రైతులు ఒకరకమైన బాధలో ఉండగా,  ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నట్టేట ముంచిందని బిజెపి శాసనసభా పక్ష ఉపనాయకుడు పాయల్ శంకర్ విమర్శించారు.  గతంలో మల్కాజిగిరి ఎంపీ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకుంటామని ఘనంగా హామీలు ఇచ్చారని పేర్కొంటూ  “రైతులకు కష్టాలు లేకుండా చూస్తాం. రెండు లక్షల వరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తాం” అని  చెప్పారని గుర్తు చేశారు. 
 
అలా ఆశపడ్డ రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని,  కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే సగం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం చెబుతోందని గుర్తు చేశారు. మిగిలిన సగం మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని చెబుతూ  రెండు లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు బ్యాంకులకు మొత్తం చెల్లించి రసీదు తెస్తేనే మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఆ విషయంపై ఇప్పటివరకు ఏ స్పష్టత లేదని ధ్వజమెత్తారు.  

ఎస్ఎల్బిసి (స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ) మీటింగ్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయ రుణాలుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్దేశించబడ్డాయి? ఆ టార్గెట్ ఎంత? ఎంత వరకు అమలయ్యింది? అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. ఎస్ఎల్బిసి సమావేశం తర్వాత జిల్లా స్థాయిలో అటువంటి సమావేశాలు జరగాల్సి ఉండగా, ఇంకా సగం జిల్లాల్లో కూడా జరగలేదని ఆయన చెప్పారు.

బ్యాంకర్లతో సమన్వయం అనే దాంట్లో ఇప్పటికీ ప్రభుత్వ వైఫల్యమే కనపడుతోందని చెబుతూ వ్యవసాయ రుణాలు ఎంత మొత్తంలో ఇచ్చారో ఇప్పటి వరకు ప్రభుత్వానికి పూర్తి సమాచారం లేదని మండిపడ్డారు.  ఈ రకమైన గందరగోళ పరిస్థితుల్లో రైతులు ఎలా నమ్మకంతో ఉండగలరు? అని శంకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.  నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయిన వెంటనే రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారని, కానీ గతంలో పదేళ్లు పాలనలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఫసల్ బీమాలో భాగస్వామ్యం అయిందని ఆయన చెప్పారు. మిగతా తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని,  రైతులు కట్టే ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తామని ప్రకటించిందని, కానీ ఆ హామీ ఇప్పటికీ అమలు చేయలేదని శంకర్ ధ్వజమెత్తారు.  2023–24 బడ్జెట్‌లో ప్రస్తావించినా, 2024–25 బడ్జెట్‌లో ఫసల్ బీమా గురించి ఒక్క మాట కూడా లేదని విమర్శించారు.

రేవంత్ రెడ్డి ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాళేశ్వరం అవినీతిపై తీవ్రంగా విమర్శలు చేశారని,  కెసిఆర్ పై సీబీఐ విచారణ జరపాలని బహిరంగంగా డిమాండ్ చేశారని బిజెపి ఎమ్యెల్యే గుర్తు చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి కాంగ్రెస్ సభలలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని లేవనెత్తుతూ సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారని చెప్పారు.  కానీ ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని పూర్తిగా మర్చిపోయిందని విస్మయం వ్యక్తం చేశారు.

గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి “నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ వచ్చాక 48 గంటలలో చర్యలు తీసుకుంటామని చెప్పారు, కానీ నివేదిక వచ్చి రెండు నెలలు దాటినా, ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. పైగా, ఇప్పుడు టెక్నికల్ అంశాలపై మాత్రమే విచారణ జరుగుతోందని చెబుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు తరచూ “బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయ్” అంటున్నారని పేర్కొంటూ  నిజంగా ఎవరు బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశారు అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసి చెప్పాలని శంకర్ సవాల్ చేశారు.  రాష్ట్రంలో, దేశంలో అధికారాన్ని బీఆర్ఎస్- కాంగ్రెస్ కలిసి పంచుకున్న చరిత్రను ప్రజలు మర్చిపోలేరని స్పష్టం చేశారు.