వాణిజ్య వివాదాల పరిష్కారంకు చైనా, అమెరికా అంగీకారం

వాణిజ్య వివాదాల పరిష్కారంకు చైనా, అమెరికా అంగీకారం
వాణిజ్య వివాదాలను పరిష్కరించు కునేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విషయమై అమెరికా, చైనాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఇరు దేశాల మధ్య వరుస వివాదాలు తలెత్తుతున్నవేళ తిరిగి చర్చలను పట్టాలెక్కించాలంటే ఒక ఫ్రేమ్‌వర్క్‌ వుండాలని ఇరు పక్షాల ప్రతినిధులు భావించారు. సోమ, మంగళవారాల్లో లండన్‌లో జరిగిన చర్చల అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన వెలువడింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాతో ట్రేడ్ డీల్ కుదిరినట్లు తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్​ఫాం ట్రూత్​లో పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేసేందుకు చైనా అంగీకరించిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము కూడా ఒప్పందంలో భాగంగా చైనా విద్యార్థులకు వీసాలు జారీ చేస్తామని, వారు అమెరికాలో చదువుకునేందుకు వీలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

‘ట్రేడ్​ డీల్​లో భాగంగా ఇకపై చైనా చేసే ఎగుమతులపై 55 శాతం సుంకాలు ఉంటాయి. అమెరికా నుంచి చైనాకు అయ్యే ఎగుమతులపై 10 శాతం సుంకాలు ఉంటాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. గత నెలలో జెనీవాలో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని దెబ్బతీసిన ఖనిజ, సాంకేతిక ఎగుమతులపై వివాదాలను పరిష్కరించడానికి మార్గాన్ని కనుగొనడంపై ఈ చర్చలు దృష్టి కేంద్రీకరించాయి. ‘అమెరికాతో వాణిజ్యానికి చైనా ద్వారాలు తెరిచేందుకు జిన్​పింగ్​ సిద్ధంగా ఉన్నారు. నేను కూడా అందుకోసమే జిన్​పింగ్​తో కలిసి పనిచేస్తున్నాను. ఇది రెండు దేశాలకు మంచి విజయం అవుతుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాతో చైనాకు గల గణనీయమైన వాణిజ్యంపై నెలకొన్న ప్రాథమిక విభేదాలను పరిష్కరించడంలో పురోగతి సాధించారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. ముందుగా ప్రతికూలతలను పరిష్కరించుకుని ముందుకు సాగడంపైనే దృష్టి పెట్టామని అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్‌ లుత్నిక్‌ విలేకర్లతో వ్యాఖ్యానించారు. పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి చర్యలు తీసుకోవాలని గత వారంలో ట్రంప్‌, జిన్‌పింగ్‌లో ఫోన్‌కాల్‌ సంభాషణ అనంతరం ఈ చర్చలు జరిగాయి. తదుపరి దఫా చర్చలు జరిగే అవకాశం ఏమైనా వుందా లేదా అనేది కూడా వెంటనే తెలియరాలేదు.

చైనా, అమెరికాలు పరస్పరం విధించుకున్న సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేసేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయి. జెనీవా ఒప్పందాలపై తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడంలోనే విలువైన సమయం వృథా అయిందని, ఇక 60 రోజులే మిగిలిందని, కానీ పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలా వున్నాయని ఆసియా సొసైటీ ఆఫ్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ ఉపాధ్యక్షుడు కట్లర్‌ వ్యాఖ్యానించారు.