
ఇకపై తత్కాల్ టికెట్ బుకింగ్ మరింత సులభం కానుంది. జూలై 1 నుంచి ఆధార్ అథంటికేషన్ కలిగిన యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునేలా రైల్వే మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల ప్రయోజనాల్ని నిజమైన వినియోగదారులకు మాత్రమే అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
“2025 జూలై 1 నుంచి ఆధార్ అథంటికేషన్ కలిగిన యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకోగలుగుతారు. ఇందుకోసం వారు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) వెబ్సైట్/యాప్లను ఉపయోగించుకోవచ్చు” అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 2025 జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ ఆధారిత ఓటీపీ అథంటికేషన్ కూడా తప్పనిసరి అని రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది.
“తత్కాల్ టికెట్లు కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులు బుకింగ్ సమయంలో సిస్టమ్-జనరేటెట్ ఓటీపీని కచ్చితంగా ఎంటర్ చేసి, అథంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2025 జూలై 15 నుంచి ఇది అమల్లోకి వస్తుంది” అని వెల్లడించారు.
తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన మొదటి 30 నిమిషాల వరకు రైల్వే అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయకుండా రైల్వే మంత్రిత్వ శాఖ పరిమితి విధించింది. ముఖ్యంగా ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు ఎయిర్ కండిషన్డ్ తరగతులకు, ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు నాన్ ఎయిర్ కండిషన్డ్ తరగతులకు ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుకింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది.
ఈ కొత్త వ్యవస్థకు అవసరమైన మార్పులు చేయాలని, ఈ మార్పులను అన్ని జోనల్ రైల్వేలకు తెలియజేయాలని రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్ (సిఆర్ ఐఎస్), ఐఆర్ సీటీసీలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతేకాదు ఈ నూతన మార్పుల గురించి సాధారణ ప్రజలకు తెలియజేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సర్క్యులర్లో పేర్కొంది
కాగా, రైలు ప్రయాణికులకు రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మేషన్ ఇప్పుడు రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందే తెలుస్తోంది. అయితే వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు తమ టికెట్ కన్ఫర్మేషన్ గురించి రైలు బయలుదేరడానికి 24 గంటల ముందే లిస్టును తయారు చేసే ప్రక్రియపై రైల్వేశాఖ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. 24 గంటల ముందే చార్ట్ ప్రిపరేషన్‌పై పైలెట్ ప్రాజెక్టును బికనీర్ డివిజన్‌లో చేపడుతున్నారు.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!