తొలిసారి తగ్గిన ఏప్రిల్‌ నెల రెవెన్యూ రాబడి

తొలిసారి తగ్గిన ఏప్రిల్‌ నెల రెవెన్యూ రాబడి
గడిచిన ఐదేండ్లలో నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ నెలలో రెవెన్యూ రాబడులు ప్రతియేటా పెరిగాయి. కానీ తెలంగాణ చరిత్రలో తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెల రెవెన్యూ రాబడి ఏకంగా రూ.579.75 కోట్లు, సొంత ట్యాక్స్‌ రెవెన్యూలో కూడా రూ.547.49 కోట్ల క్షీణత రికార్డయింది. ఈ విషయాన్ని కాగ్‌కు సమర్పించే నెలవారీ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 
 
కాగ్‌ నివేదిక ప్రకారం 2025-26 బడ్జెట్‌లో అన్ని రకాల ఆదాయ మార్గాల్లో రూ.2,29,720.62 కోట్ల రెవెన్యూ రాబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, మొదటి నెల ఏప్రిల్‌లో రూ.11,239.13 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే అంచనాలో 4.89% లక్ష్యాన్ని చేరుకున్నది. ఇదే తరహాలో ప్రతినెలా 5 శాతమే రాబడి వస్తే అంచనాలో 60 శాతానికి పరిమితం అవుతుంది.2023-24లో బడ్జెట్‌ అంచనాకు 78.08% చేరగా, కాంగ్రెస్‌ అధికారం చేపట్టాక 2024-25లో 75.85 శాతానికే పరిమతమైంది. లక్ష్యంలో రెండున్నర శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 60-70% లక్ష్యం చేరడమే కాంగ్రెస్‌ సర్కారు కష్టతరంగా మారనున్నది. ఏటేటా క్రమంగా రెవెన్యూ రాబడులు పెరగాల్సింది పోయి తగ్గుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఏప్రిల్‌ నెల రెవెన్యూ రాబడులు గడిచిన ఐదేండ్లలో పెరగగా, తొలిసారిగా ఆదాయం తగ్గుదల రూ.579.75 కోట్లు నమోదైంది. రాష్ట్ర ఖజానాకు వచ్చే రాబడిలో పన్ను ఆదాయం కీలకమైనది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌, జీఎస్టీ ఇలా.. పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతుంది. ఈ పన్నుల రాబడి భేషుగ్గా ఉంటే రాష్ట్ర ఆర్థిక ప్రగతి బాగున్నట్లు లెక్క.

2025-26 బడ్జెట్‌లో ట్యాక్స్‌ రెవెన్యూ రూ. 1,75,319.35 కోట్లు వస్తుందని అంచ నా వేశారు. ఏప్రిల్‌లో రూ. 10,916.68 కోట్లు (6.23%) మాత్రమే వచ్చింది. గత ఏడాది ఇదే నెల రూ. 11,464.17 కోట్లు ఆదాయం వచ్చింది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్యాక్స్‌ రెవెన్యూ రూ.547.49 కోట్లు తగ్గింది.  ప్రతియేటా పన్ను ఆదాయం పెరగాల్సి ఉండగా, సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో క్షీణిస్తుంది. రేవంత్‌రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 17 నెలలైనా నేటికీ రాష్ర్టానికి వచ్చే రాబడులు గాడినపడటం లేదు. రాష్ట్ర ఖజానా ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉంది.