కాళేశ్వరం సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే!

కాళేశ్వరం సమాచారం అంతా కేసీఆర్, హరీష్ రావు వద్దే!
కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారమంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల వద్దే ఉందని అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి విచారిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ ముందు శుక్రవారం హాజరై 20 నిముషాల పాటు పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని వెల్లడించారు. 
 
ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశమని ఈటల వివరించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పుపై ప్రశ్నించగా కేబినెట్‌ నిర్ణయం మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని చెప్పిన్నట్లు మీడియాకు తెలిపారు. సాంకేతిక కమిటీ, కేబినెట్‌ కమిటీ సిఫార్సు మేరకే మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని తెలిపారు. 
 
కార్పొరేషన్‌ ఏర్పాటు పైనా ప్రశ్నించగా నిధుల కొరత దృష్ట్యా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా, కమిషన్ సాగునీటి మంత్రి పరిధిలో ఉందని, ఆర్ధిక మంత్రికి సంబంధం లేదని స్పష్టం చేశారు. పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని డీపీఆర్​లో ఉందని, అయితే నగదు వసూలు చేయలేదని ఈటల రాజేందర్ కమిషన్‌కు వివరించారు.
 
కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని,, కాళేశ్వరం నష్టాలకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం నా మానస పుత్రిక అని కేసీఆర్‌ వందలసార్లు చెప్పారని గుర్తు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని కేసీఆరే నిర్ణయించారని పేర్కొంటూ  కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు తప్పు, ఒప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తేలుస్తారని చెప్పారు.

ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తన పాత్రేమీ లేదని ఈటల పేర్కొన్నారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్​ కోసం కేబినెట్ సబ్​ కమిటీని కేసీఆర్​ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ కమిటీకి అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్​రావు ఛైర్మన్​గా ఉన్నారని వివరించారు. రూ.63 వేల కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన చేశారని, తర్వాత దానిని రూ.82 వేల కోట్లకు పెంచారని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా నైతిక విలువలు పాటించానన్న ఈటల రాజేందర్, తన కణతపై తుపాకీ పెట్టినా నిజమే మాట్లాడతానని తేల్చి చెప్పారు.