చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో 11 మంది మృతి

చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో 11 మంది మృతి

ఐపీఎల్‌-2025  కప్‌ను గెలుచుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ విజయోత్సవాలు విషాదాంతమయ్యాయి.  బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు అభిమానులు బారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది దుర్మరణం పాలయ్యారు.  మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దాదాపు 50 మంది గాయాలపాలయ్యారు. వారిని వివిధ అస్పత్రులకు తరలించారు. అభిమానులను నియంత్రించేందుకు చిన్నస్వామి స్టేడియం దగ్గర పోలీసులు లాఠీఛార్జ్‌ జరిపారు.

ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్‌ కప్పు గెలిచింది. బుధవారం ఆ జట్టు అహ్మదాబాద్‌ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకుంది. నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో సంబురాలకు ఏర్పాట్లు చేశారు. ఈ సంబురాల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొందరు బారీకేడ్లను, పోలీసులను తోసుకుని స్టేడియం వైపు దూసుకెళ్లారు. దాంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ క్రమంలో అభిమానులు గుంపులు గుంపులుగా స్టేడియంలోకి పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట జరిగింది.

తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. ఆర్సీబీ అభిమానులు బారీగా తరలిరావడంతో అదుపు చేయలేకపోయామని, వైఫల్యం తమదేనని ఆయన చెప్పారు.  ఊహించ‌ని రీతిలో అభిమానులు రావ‌డంతో పోలీసులు వారిని అదుపు చేయ‌లేకపోయారని తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య క్షతగాత్రులు చికిత్స పొందుతున్న బౌరింగ్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిలందరికీ సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వాళ్ల కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని సీఎం తెలిపారు. 

“చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద బుధ‌వారం జ‌రిగిన‌ తొక్కిస‌లాట‌లో 11 మంది చ‌నిపోయారు. 33 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఊహించ‌ని రీతిలో అభిమానులు త‌ర‌లి రావ‌డంతో ఈ దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. దాదాపు 3 ల‌క్ష‌ల మంది జ‌నం రావ‌డంతో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. మృతుల కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తాం. గాయ‌ప‌డిన‌వాళ్ల‌కు మెరుగైన వైద్య చికిత్స అందిస్తాం” అని సిద్ధ‌రామ‌య్య ప్రకటించారు. అంతేకాదు తొక్కిస‌లాట‌పై న్యాయ విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశించారు.

తొక్కిస‌లాట‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపిన ఆయ‌న మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు ఆత్మీయుల‌ను కోల్పోయిన ఫ్యామిలీస్‌కు కేంద్ర త‌ర‌ఫున‌ రూ. 2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వాళ్ల‌కు రూ. 50 వేల ప‌రిహారం చెల్లిస్తామ‌ని మోడీ వెల్ల‌డించారు.

 
ఈ తొక్కిసలాటపై బీసీసీఐ విచారం వ్యక్తం చేస్తూ  ఆర్సీబీ విజయోత్సవానికి మరింత మెరుగైన రీతిలో ప్రణాళికలు చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటీపడతారనే విషయం అందరికీ తెలుసునని, విజయోత్సవం నిర్వాహకులు ముందుజాగ్రత్త చర్యలు, అభిమానుల భద్రతకు పకడ్బందిగా ఏర్పాట్లు చేయాల్సిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. కానీ ఏర్పాట్లలో లోపాలు ఉన్నట్లు కనిపిస్తోందని వివరించారు.
 
ఐపీఎల్‌ కప్‌తో జట్టు బెంగళూరుకు చేరుకున్న సందర్భంగా నగరం మొత్తం ఎరుపెక్కింది. ఎక్కడ చూసినా ఆర్‌సీబీ అభిమానులు జట్టు జర్సీలు ధరించి సందడి చేస్తున్నారు. వేలాది మంది అభిమానులు విధాన సౌధకు చేరుకుని ‘ఆర్‌సీబీ..’, ‘ఆర్‌సీబీ..’ నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. 

చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపించింది. స‌రైన భద్ర‌తా ఏర్పాట్లు చేయడంలో క‌ర్నాట‌క స‌ర్కార్ విఫ‌ల‌మైంది. భారీగా త‌ర‌లివ‌చ్చిన అభిమానుల‌ను నియంత్రించ‌లేక‌పోయారు పోలీసులు.  ఒక్క‌సారిగా స్టేడియం గేట్లు తెర‌వ‌డంతో భారీకేడ్లను తోసుకుంటూ మ‌రీ స్టేడియంలోకి దూసుకొచ్చారు ఫ్యాన్స్. అంతే.. వాళ్ల‌ను కంట్రోల్ చేసేందుకు లాఠీ ఛార్జ్ చేసినా అప్ప‌టికే న‌ష్టం జ‌రిగిపోయింది.

తొక్కిసలాట ఘటనకు కర్ణాటక ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా ఆర్​సీబీ విజయోత్సవాలను నిర్వహించిందని మండిపడింది. ఇలాంటి కార్యక్రమాలకు అభిమానులు పెద్దఎత్తున తరలివస్తారని తెలిసిన కూడా కనీస ఏర్పాట్లపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టిపెట్టలేదని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర దుయ్యబట్టారు.  ప్రచారంపై ఉన్న దృష్టిని కర్ణాటక ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లపై పెట్టి ఉంటే తొక్కిసలాట జరిగేది కాదని విమర్శించారు. చిన్నస్వామి స్టేడియం వద్ద కనీసం ఒక్క అంబులెన్స్‌ కూడా లేదని విజయేంద్ర విస్మయం వ్యక్తం చేశారు.