జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

జులై 21 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు
పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ లకు సంబంధించిన విషయాలపై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశంలో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది.  జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి  కిరెణ్‌ రిజిజు బుధవారం ప్రకటించారు. 

ఈ సమావేశాల్లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చించనున్నట్లు తెలిసింది. అంతేకాదు 23 రోజుల పాటూ జరిగే ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులను కూడా కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పాక్‌ వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసింది.

మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా కేంద్రంలోని మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో పహల్గాం ఉగ్రదాడి ఘటన, అనంతరం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరుతూ ప్రతిపక్షానికి చెందిన 16 పార్టీల ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. 

ఈ లేఖపై లోక్‌సభకు చెందిన 200 మందికి పైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. భారత్‌-పాక్‌ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై కూడా ఈ సందర్భంగా చర్చించాలని పట్టుబట్టారు. సరిహద్దు గ్రామాల్లో పాక్‌ రేంజర్లు జరిపిన షెల్లింగ్‌లో ప్రాణాలు విడిచిన పౌరుల గురించి కూడా చర్చించాలని గుర్తు చేశారు. 

పహల్గాం ఉగ్రదాడి తదనంతరం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో తమ ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వానికి మద్దతునిచ్చాయన్న విపక్ష నేతలు తమ డిమాండ్‌ మేరకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.