కర్నూల్ లో ముగ్గురికీ, వరంగల్ లో ఏడుగురుకు కరోనా

కర్నూల్ లో ముగ్గురికీ, వరంగల్ లో ఏడుగురుకు కరోనా
 
* దేశంలో 4,300కు దాటినా కరోనా కేసులు
 
ఏపీ, తెలంగాణలోనూ కొత్త కరోనా కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తాజాగా పరీక్షలు.. చికిత్స పైన మార్గదర్శకాలు జారీ చేసాయి. కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కర్నూలు జీజీహెచ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌కు పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని వెంకటరమణకాలనీకి చెందిన ప్రొఫెసర్‌ హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 
 
అలాగే మంత్రాలయం మండలం పరమాన్‌దొడ్డి తండాకు చెందిన 25 ఏళ్ల మహిళ అనారోగ్యంతో వారం రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరింది. ఆమెకు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి.

వరంగల్‌ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రి పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్‌ కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

కొత్తగా బుధవారం దాదాపు 300 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో దేశంలో కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,300 దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 276 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,302కి పెరిగింది. 

అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,373 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 510, గుజరాత్‌లో 461, ఢిల్లీలో 457, పశ్చిమ బెంగాల్‌లో 432, కర్ణాటకలో 324, తమిళనాడులో 216, ఉత్తర ప్రదేశ్‌లో 201 కేసులు పాజిటివ్‌గా ఉన్నాయి.

గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో నాలుగు, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 44కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకూ 3,281 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

కాగా, తాజాగా కరోనా కేసుల నమోదు కొత్త వేరియంట్‌ పట్ల ప్రజలు భయాందోళనలకు గురి కానవ సరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న రోగులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని, ఆయాసం ఉండి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
 
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె, కిడ్నీ, క్యాన్సర్‌, లివర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇటు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్షేత్ర స్థాయిలో పరీక్షలు.. చికిత్స పైన అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచుతున్నారు.