ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ ఐపిఎల్ ట్రోఫీకైవసం

ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ ఐపిఎల్ ట్రోఫీకైవసం

ఎట్టకేలకు ఐపిఎల్‌ సీజన్‌-18 టైటిల్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సిబి) జట్టు కైవసం చేసుకుంది. పంజాబ్‌ కింగ్స్‌తో మంగళవారం జరిగిన ఫైనల్లో బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో గెలిచి తన 18 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తోనే సంతృప్తి పడిన బెంగళూరు జట్టు ఈసారి పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి తన చిరకాల కలను సాకారం చేసుకుంది. 

క్వాలిఫయర్‌-1లోనూ పంజాబ్‌ను చిత్తుచేసిన బెంగళూరు ఫైనల్లోనూ ఆ స్థాయి ప్రదర్శనను కనబర్చి టైటిల్‌ను ముద్దాడింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ జట్టు 184 పరుగులే చేసింది. దీంతో పంజాబ్‌ జట్టు రెండోసారి రన్నరప్‌తోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. 

బెంగళూరు బౌలర్లు భువనేశ్వర్‌, కృనాల్‌ పాండ్యాకు రెండేసి, హేజిల్‌వుడ్‌, యశ్‌ దయాల్‌, షెఫర్డ్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. పంజాబ్‌ బ్యాటర్లు శశాంక్‌ సింగ్‌(61) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును విరాట్‌ కోహ్లి(43) మినహా మిగిలిన ఏ ఒక్క బ్యాటర్‌ మూడు పదుల స్కోర్‌ చేరుకోలేకపోయాడు. ఒకవైపు కోహ్లి దూకుడుగా ఆడుతుంటే, మరోవైపు బెంగళూరు వరుసగా వికెట్లు కోల్పోయింది.

దీంతో బెంగళూరు జట్టు 200కు పైగా స్కోర్‌ చేస్తుందని తొలుత భావించినా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు నష్టపోయి 190 పరుగులే చేయగల్గింది. పంజాబ్‌ పేసర్‌ జేమీసన్‌(3/48), ఆర్ష్‌దీప్‌ సింగ్‌(3/40)లు విజృంభించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు ఓపెనర్‌ డేంజరస్‌ ఫిల్‌ సాల్ట్‌(16)ను ఔట్‌ చేసిన జేమీసన్‌, ఆ తర్వాత కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌(26)ను ఔట్‌ చేసి మరో దెబ్బకొట్టాడు. 

ఓవైపు వికెట్లు పడుతున్నా విరాట్‌ కోహ్లీ(43) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. డెత్‌ ఓవర్లలో జితేశ్‌ శర్మ(24), రొమారియో షెపర్డ్‌(17)లు ధనాధన్‌ ఆడారు. క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ఫైనల్లో మాత్రం తడబడింది. లీగ్‌ ఆసాంతం చెలరేగి ఆడిన ప్రధాన బ్యాటర్లు కీలక పోరులో రాణించలేకపోయారు. సాల్ట్‌ ఔటయ్యాక విరాట్‌ రెండో వికెట్‌కు మయాంక్‌ అగర్వాల్‌(24)తో 38 పరుగులు జోడించాడు. 

మయాంక్‌ను ఊరించే బంతితో వెనక్కి పంపాడు చాహల్‌. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్‌ పాటిదార్‌ (26)ధనాధన్‌ ఆడుతూ స్కోర్‌ బోర్డును ఉరికించాడు. కోహ్లీతో కలిసి స్కోర్‌ వంద దాటించాడు. మూడో వికెట్‌కు 27 బంతుల్లోనే 40 పరుగులు రాబట్టిన పాటిదార్‌ను జేమీసన్‌ ఎల్బీగా ఔట్‌ చేసి పంజాబ్‌కు మరోసారి బ్రేకిచ్చాడు. మరికొద్దిసేపటికే విరాట్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

లివింగ్‌స్టోన్‌(25), జితేశ్‌ శర్మ(24)లు దూకుడుగా ఆడారు. జేమీసన్‌ వేసిన 17వ ఓవర్లో.. రెచ్చిపోయిన జితేశ్‌ మూడు సిక్సర్లతో 23 పరుగులు పిండుకున్నాడు. అతడి మెరుపులతో ఆర్సీబీ స్కోర్‌ 170కి చేరుకుంది. మరో మూడు ఓవర్లు ఈ ఇద్దరూ నిలబడితే 200 ప్లస్‌ ఖాయం అనిపించింది. 

కానీ, జేమీసన్‌ ఓవర్లో లివింగ్‌స్టోన్‌ ఔట్‌ కాగా, ఆ తర్వాత జితేశ్‌ను వ్యాషక్‌ బౌల్డ్‌ చేసి ఆర్సీబీ భారీ స్కోర్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. అయితే.. అజ్మతుల్లా వేసిన 19వ ఓవర్లో రొమారియో షెపర్డ్‌(17) వరుసగా 4, 6 బాదాడు. కానీ, అర్ష్‌దీప్‌ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు తీయడంతో ఆర్సీబీ 190కే పరిమితమైంది. ఐపిఎల్‌ చరిత్రలో పంజాబ్‌ జట్టు రెండోసారి, బెంగళూరు జట్టు నాల్గోసారి మాత్రమే ఫైనల్‌కు చేరాయి.