
అతి త్వరలోనే భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని యూఎస్ వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ తెలిపారు. ఇరుదేశాలు కలిసి పనిచేసే ఆమోదయోగ్యమైన మార్గాన్ని కనుగొన్నాయని వెల్లడించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొంటూ భారత్ సరైన వ్యక్తిని ఎంపిక చేసి పంపిస్తే, తన నుంచి చర్చలకు తగిన వ్యక్తిని పంపిస్తామని చెప్పారు.
అలాగే భారత్‌లో అధిక సుంకాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటిగా ఎత్తి చూపారని లుట్నిక్ గుర్తు చేశారు. వాటిని సహేతుకమైన స్థాయికి తగ్గించడం ద్వారా భారత్- అమెరికా గొప్ప వాణిజ్య భాగస్వాములుగా ఉండగలవని చెప్పారు. ఈ విషయంలోనే ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని లుట్నిక్ వివరించారు.
అంతేకాకుండా ముందుగా ఒప్పందం చేసుకునే దేశాలకు మెరుగైన ఒప్పందం లభిస్తుందని పేర్కొన్నారు. జులై 4 నుంచి 9లోపు వచ్చే వారికి ఆ అవకాశం అందుకోవచ్చు అని లుట్నిక్ చెప్పారు. ఒప్పందాలు సాధారణంగా రెండు లేదా మూడు సంవత్సరాలు పడతాయని పేర్కొంటూ దీనిని తాము ఒక నెలలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్యలోటును తగ్గించాలని కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను ఎంతో మెచ్చుకుంటారని, గౌరవిస్తారని ఆయన తెలిపారు. రెండు దేశాలు మంచి సంబంధాలను కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. భారత్ కూడా ఈ వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంగా ఉందని, ఇప్పటికే ప్రతిపాదిత ఒప్పదంపై న్యూడిల్లీ చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు.
దీనిపై ఇరుదేశాలు కలిపి పనిచేయడంపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇక ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఓ బృందం న్యూడిల్లీలో పర్యటిస్తోంది. ఈక్రమంలో చర్చలను ముందుకుతీసుకెళ్లి జూన్ చివరికి వీటిని ఓ కొలిక్కి తేనున్నాయి. 26శాతం ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
కొన్ని నెలల క్రితం ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 191 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
More Stories
ఎవరూ క్లెయిమ్ చేయని రూ.1.84 లక్షల కోట్లు
నవంబరు 23న భారత్‌కు నీరవ్ మోదీ?
500 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఎలాన్ మస్క్