బ్రిక్స్ దేశాల మధ్య సైబర్ భద్రత బలోపేతం

బ్రిక్స్ దేశాల మధ్య సైబర్ భద్రత బలోపేతం

బ్రిక్స్ దేశాల మధ్య సైబర్ భద్రత మరింత బలోపేతం కావాలని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. స్టార్టప్ అభివృద్ధి, టెలీ కమ్యూనికేషన్స్, డేటా ప్రొటెక్షన్ చట్టం, డిజిటల్ స్కిల్స్ తదితర కార్యక్రమాలు భారత్‌ను గ్లోబల్ డిజిటల్ లీడర్‌గా నిలబెడుతున్నాయని తెలిపారు. 

డిజిటల్ ప్రగతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టి, నాయకత్వమే కారణమని స్పష్టం చేశారు. బ్రెజిల్ రాజధాని బ్రెజీలియాలో నిర్వహించిన 11వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశంలో భారత తరఫున ప్రతినిధిగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)లో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న డిజిటల్ మార్పు జరుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. 

డిజిటల్ సమావేశం ఒక జాతీయ లక్ష్యమే కాదని, అది ప్రపంచ అవసరమని పెమ్మసాని స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఆధార్, యూపీఐ సహా తదితర అంశాల్లో భారత్‌ ఏ విధంగా డిజిటల్ చైతన్యం సాధించిందనేది ఈ సందర్బంగా ఆయన సోదాహరణగా వివరించారు. ఆధార్ ద్వారా 95 కోట్ల మందికి పైగా ప్రజలకు భరోసా కలిగించే డిజిటల్ ఐడెంటిటీ లభించిందని చెప్పారు. దీని వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ సేవలకు మరింత సౌలభ్యమైందని చెప్పారు. 

యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 46 శాతం వాటా భారత్‌దేనని గుర్తు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఒక స్థిరమైన, అంచనా వేయదగిన డిజిటల్ వ్యవస్థను నిర్మించిందని వివరించారు. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య డీపీఐ సహకారం పెంచుకోవాల్సి ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సమావేశం, ప్రభావంతమైన పాలనకు డీపీఐ ఒక కీలక సాధనమని పేర్కొన్నారు. ఇక టెలికం మోసాలను ఎదుర్కొనే సంచార్ సాథీ కార్యక్రమం గురించి మంత్రి డాక్టర్ పెమ్మసాని సోదాహరణగా వివరించారు.