ఉక్రెయిన్ దాడిలో 40కి పైగా రష్యన్ బాంబర్ ప్లేన్స్ ధ్వంసం!

ఉక్రెయిన్ దాడిలో 40కి పైగా రష్యన్ బాంబర్ ప్లేన్స్ ధ్వంసం!

* రష్యా దాడిలో 12 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి

మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తొలిసారి ఉక్రెయిన్‌, రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది. నాలుగు వైమానిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కిపైగా రష్యా బాంబర్‌ ప్లేన్లు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ మీడియా తెలిపింది. రష్యా భూభాగంలోకి వందల కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ దాడి చేయడం ఇదే తొలిసారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది సైనికులు మృతిచెందారు.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఇస్తాంబుల్‌లో సోమవారం శాంతి చర్చలు జరగనుండగా ఈ దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా కీలక మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్‌ ఇంత భారీ స్థాయిలో దాడి జరపడం ఇదే మొదటిసారి అని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌ దాడిలో ధ్వంసమైన ఎయిర్‌క్రాఫ్టుల్లో టీ యూ-95, టీయూ-22 వ్యూహాత్మక బాంబర్లు కూడా ఉన్నాయని పేర్కొంది. 

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా కూడా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌ సైనిక శిక్షణ స్థావరంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.  ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వయంగా పర్యవేక్షించారని ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనికాధికారి తెలిపారు. దాదాపు ఏడాదిన్నరగా దాడులకు ప్రణాళిక జరుగుతోందని చెప్పారు. 

ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాకు దాదాపు 2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉంటందని ఓ కథనం పేర్కొంది. అటు దాడులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  రష్యాలోని ఇర్కుట్స్‌ ప్రాంతంలోని స్రెడ్నీ సెటిల్‌మెంట్‌లోని సైనిక విభాగంపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి చేసిందని రష్యా ప్రాంతీయ గవర్నర్‌ ఇగోర్‌ కొబ్జెవ్‌ నిర్ధారించారు. ఒలెన్యా, బెలాయా సహా ఐదు మిలిటరీ బేస్‌లపై దాడి జరిగినట్టు చెప్పారు. 

పేలుడుతో మర్‌మాన్స్‌ ప్రాంతంలోని ఒలెన్యా ఎయిర్‌బేస్‌లో పేలుళ్లు సంభవించాయని, దట్టంగా పొగ అలుముకుందని స్థానిక మీడియా నెక్సా వెల్లడిస్తూ దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేసింది. కాగా, అణ్వాయుధాలను మోసుకెళ్లే విమానాలు ఉండే ఈ ఎయిర్‌బేస్‌ రష్యా అతి ముఖ్య వ్యూహాత్మక ప్రదేశమని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి.

తొలుత ఉక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది. ఏడు బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. సైనిక శిక్షణ కేంద్రంపై జరిగిన క్షిపణి దాడిలో 12 మంది సైనికులు మృతిచెందారని అధికారులు తెలిపారు. 60 మందికిపైగా గాయపడ్డారని చెప్పారు. రష్యా దాదాపు 472 డ్రోన్లను ప్రయోగించిందని వెల్లడించారు. వాటిలో 385 డ్రోన్లను అడ్డుకున్నామని తెలిపారు. 

మరోవంక, పశ్చిమ రష్యాలో అర్ధరాత్రి పేలుళ్లతో రెండు బ్రిడ్జీలు కూలిపోగా, రెండు రైళ్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనల్లో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ  ‘ఉగ్రవాద చర్యలు’పై దర్యప్తు  చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లకు గల కారణాన్ని  అధికారులు  వెల్లడించలేదు. రెండు పేలుళ్లు ఉక్రెయిన్‌ సరిహద్దులో ఉన్న రష్యన్‌ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. 

జూన్‌ 2న జరగనున్న రష్యా ఉక్రెయిన్‌ చర్చలకు ఒకరోజు ముందు ఈ పేలుళ్లు జరిగాయి. సమీపంలో ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌ సరిహద్దులోని బ్రయాన్స్క్‌ ప్రాంతంలో ఉన్న మొదటి వంతెన శనివారం ఒక ప్యాసెంజర్‌ రైలుపై కూలిపోవడంతో ఏడుగురు మరణించారు. క్లిమోవో-మాస్కో రైలు 388 మంది ప్రయాణికులతో వెళుతుండగా వంతెనపై పేలుడు జరిగిందని ఆ ప్రాంత గవర్నర్‌ అలెగ్జాండర్‌ బోగోమాజ్‌ స్థానిక మీడియాతో పేర్కొన్నారు. 

బ్రయాన్స్క్‌ వంతెన కూలిపోయిన కొన్ని గంటల తర్వాత, ఉక్రెయిన్‌ సరిహద్దులోని కుర్స్క్‌ ప్రాంతంలో వంతెన కూలిపోవడంతో మరో రైలు పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి వంతెన కూలిపోవడంతో గూడ్స్‌ రైలు పట్టాలపై నుండి రహదారిపై పడిందని ఆ ప్రాంత తాత్కాలిక గవర్నర్‌ అలెగ్జాండర్‌ ఖిన్‌స్టెయిన్‌ ఆదివారం తెలిపారు. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగాయని, కానీ ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.