కాంగ్రెస్‌లో కేసిఆర్ కోవర్టు టిపిసిసి అధ్యక్షుడే

కాంగ్రెస్‌లో కేసిఆర్ కోవర్టు టిపిసిసి అధ్యక్షుడే

కాంగ్రెస్ పార్టీలో కేసిఆర్ కోవర్టు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడేనని బిజెపి ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావు పవార్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ రావులు ఆరోపించారు. ఆయనే బిజెపికి, ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కేసిఆర్‌కి అనుకూలంగా కోవర్టు రాజకీయాలు చేస్తున్నది మహేష్ కుమార్ గౌడేనని అందరికీ తెల్సిందేనని వారు స్పష్టం చేశారు.

నిజామాబాద్‌కు చెందిన మహేష్ కుమార్ గౌడ్ 2014 లోకసభ ఎన్నికల్లో అప్పటి బీఆర్‌ఎస్ అభ్యర్ధి కవితకు పరోక్ష మద్దతు ఇచ్చారని వారు వెల్లడించారు. ఇదే విషయమై మహేష్ కుమార్ గౌడ్‌పైన అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన మధు యాష్కీ గౌడ్ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారని సమాచారం ఉందని తెలిపారు. కవితతో ఉన్న ఆ సఖ్యత వల్లనే ఆమెను కాంగ్రెసులోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాలని మహేష్ గౌడ్ వారి పార్టీ హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. 

బిజెపిలో బీఆర్‌ఎస్ విలీనంపై కసరత్తు జరిగిందంటూ కవిత నిరాధార వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆ అంశంపై బిజెపిని విమర్శించాలంటూ ఇచ్చిన సూచన మేరకు మహేష్ కుమార్ గౌడ్ దురుద్దేశ పూరితంగా ఎంపీ ఈటల రాజేందర్ ను, బిజెపిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమనేతగా ఎంపీ ఈటల రాజేందర్‌కి ఉన్న తిరుగులేని ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు  గౌడ్ తనదైన కట్టుకధలతో కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్ పేటలో ఓ ఫామ్ హౌజులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో భేటీ అయి, అక్కడి నుంచి మాజీ సీఎం కేసిఆర్‌తో ఫోనులో మాట్లాడినట్టు మహేష్ కుమార్ గౌడ్ నిరాధార ఆరోపణలు చేశారని అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపికున్న ప్రతిష్టతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఆయన కట్టుకధలు అల్లారని వారు మండిపడ్డారు. వారిద్దరు శామీర్ పేటలో ఏ ఫామ్ హౌజులో భేటీ అయ్యారో అందుకు సంబంధించిన ఆధారాలేంటో 24 గంటల్లోగా బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే అదంతా కట్టుకధే అని అంగీకరించి తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని సవాల్ చేశారు. 

బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ అభ్యుదయవాదిగా, తెలంగాణ ఉద్యమ నేతగా, మంత్రిగా ప్రజల బాగోగుల కోసం పనిచేసి అన్నివర్గాల మన్ననలు పొందారని తెలిపారు. తెలంగాణ సమకాలీన రాజకీయాల్లో అన్ని వర్గాల ఆదరణ పొందిన బీసీ నేతల్లో ఈటల రాజేందర్ కూడా ఒకరని గుర్తు చేయసారు. ఇమేజ్ ఉన్న లీడరు తమ పార్టీలో లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని బిజెపి ఎమ్యెల్యేలు దయ్యబట్టారు. 

ఈటల ఇమేజ్‌ను చూసి ఓర్వలేక టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదే పనిగా ఆయన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రెండో వారంలో కూడా ఇదే గౌడ్ తన అతి తెలివిని ప్రదర్శిస్తూ ఈటల రాజేందర్‌ది ఏ కులం అని మూర్ఖంగా ప్రశ్నించి తెలంగాణ ప్రజల ముందు భంగపడ్డారని తెలిపారు. అయినా తన రాజకీయ మనుగడ కోసం అదేపనిగా ఈటలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.