బిఆర్ఎస్ నేతలే బీజేపీలో విలీన ప్రయత్నాలు

బిఆర్ఎస్ నేతలే బీజేపీలో విలీన ప్రయత్నాలు

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నడిపే సినిమాలో కెసిఆర్‌ను జోకర్‌గా మార్చారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా ‘చార్ పత్తా’ సినిమా ను నడుస్తోందని తెలిపారు. కవిత ఎపిసోడ్‌తో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? అని మీడియా కూడా ఆలోచించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనిపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండటంతో వాళ్ల దృష్టిని మళ్లించేందుకు ఇట్లాంటి ఎత్తుగడ వేస్తోందని ఆయన ఆరోపించారు. పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలిపారు.  

తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2014లో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పి) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని, యాసంగి వడ్లకు సంబంధించి రైతులు ఎన్ని బాధలు పడ్డరో కళ్లారా చూసినం అంటూ ధ్వజమెత్తారు. వానలతో పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోతుంటే కనీసం టార్పాలిన్లు కూడా ఇయ్యకుండా రైతులను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

“తాలు, తడిసిన వడ్లని సాకు చూపుతూ క్వింటాలుకు పది కిలోలదాకా కటింగ్ చేసి రైతులను దోచుకున్నరు. ఇగ బోనస్ పైసలిస్తమన్నరు. ఇంతవరకు నయాపైసా ఇయ్యలేదు. అసలు వడ్ల కొనుగోలు పైసలే ఇంతవరకు రాలేదని రైతులంతా మొత్తుకుంటున్నరు” అని విమర్శించారు. రైతుల విషయంలో కెసిఆర్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని  సంజయ్ మండిపడ్డారు. 
 
 కాళేశ్వ రం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫాంహౌస్, ఫార్ములా ఈ రేసు కేసుల విషయంలో కెసిఆర్, కెటిఆర్‌లను అరెస్ట్ చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయిందని చెబుతూ ఢిల్లీకి పోయి మూటలు అప్పగించడం తప్ప కాంగ్రెసోళ్లతో ఏదీ చేతగాదని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సంజయ్ ఆరోపించారు. సిఎం వ్యాఖ్యలు పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచిపోషించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్, హరీశ్ రావు భేటీ అయ్యారనే విషయం తనకు తెలియదని, ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు.