ఉక్కు, అల్యూమినియంలపై అమెరికా సుంకాలతో భారత్ పై భారం

ఉక్కు, అల్యూమినియంలపై అమెరికా సుంకాలతో భారత్ పై భారం

ఉక్కు, అల్యూమినియంలపై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో భారత ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ (జిటిఆర్‌ఐ) పేర్కొంది. ఈ చర్య భారత ఉత్పత్తిదారులు మరియు ఎగుమతిదారుల లాభదాయకతను దెబ్బతీస్తుందని జిటిఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్  శ్రీవాస్తవ తెలిపారు.  భారత్‌పై ఈ పరిణామం ప్రత్యక్షంగా ఉంటుందని చెప్పారు. 

ఈ సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై భారత్‌ ప్రతీకార సుంకాలను విధిస్తుందో లేదో చూడాలని ఆయన పేర్కొన్నారు. గతంలో విధించిన ఉక్కు సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలను విధించే ఉద్దేశాన్ని సూచిస్తూ భారత్‌ ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)లో అధికారిక నోటీసు జారీ చేసిందని తెలిపారు.

ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాలను రెట్టింపు చేస్తానని అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ శుక్రవారం ప్రకటించారు. 1962నాటి అమెరికా వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్‌ 232 కింద ఈ పెంపుదల చేశారు. విదేశాల నుండి  దిగుమతులు జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తే అధ్యక్షులు సుంకాలు లేదా ఇతర వాణిజ్య పరిమితులను విధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. 

2018లో ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలను విధించేందుకు ట్రంప్‌ మొదట ఈ సెక్షన్‌ను  వినియోగించారు. తిరిగి 2025 ఫిబ్రవరిలో ఉక్కు, అల్యూమినియంలపై సుంకాలను 25శాతానికి పెంచారు. 2024-25లో, భారతదేశం అమెరికాకి 4.56బిలియన్‌ డాలర్ల విలువైన ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియం ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వీటిలో 587.5 మిలియన్‌ డాలర్ల ఇనుము మరియు ఉక్కు, 3.1 బిలియన్‌ డాలర్లు ఇనుము లేదా ఉక్కు వస్తువులు, 860 మిలియన్‌ డాలర్లు అల్యూమినియం మరియు సంబంధిత వస్తువులు ఉన్నాయి.