దేశంలో 2710 యాక్టివ్ కరోనా కేసులు

దేశంలో 2710 యాక్టివ్ కరోనా కేసులు
 

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కరోనా కేసులు 2710 దాటగా, గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం అత్యధికంగా కేరళలో 1,147 కేసులు నమోదయ్యాయి. 424 కేసులతో మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానంలో ఉంది. డిల్లీ-294, గుజరాత్‌ -223, కర్ణాటక-148, తమిళనాడు-148, పశ్చిమ బంగాల్‌-116 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

 కాగా రాజస్థాన్‌- 51, ఉత్తరప్రదేశ్‌- 42, పుదుచ్చేరి- 25, హరియాణా- 20, ఆంధ్రప్రదేశ్‌- 16, మధ్యప్రదేశ్‌- 10, గోవా- 7, ఒడిశా-4, పంజాబ్-4, జమ్మూకశ్మీర్‌-4, తెలంగాణ-3, అరుణాచల్ ప్రదేశ్-3, చండీగఢ్-3, మిజోరం-2, అసోం-2 చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి.

గతవారంలో 5 రెట్ల వేగంతో కరోనా కేసులు పెరిగినట్టు అధికారులు చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా మహారాష్ట్రలో ఇద్దరు, డిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. వైరస్‌ వ్యాప్తి వేగంగా జరగుతుండడం, మరణాలు కూడా క్రమంగా పెరగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపవద్దని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం సర్క్యులర్​ జారీ చేసింది.

అధిక శాతం కరోనా కేసుల్లో వ్యాధి తీవ్రత మధ్యస్థంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేరళలో అధిక కేసులు వెలుగులోకి రావడానికి కారణం అక్కడ టెస్టులు ఎక్కువగా చేస్తుండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిజోరమ్‌లో దాదాపు ఏడు నెలల తరువాత రెండు యాక్టివ్ కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఒమైక్రాన్ వేరియంట్‌కు చెందిన ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8.1 అనే కరోనా ఉపవేరియంట్ల వల్ల కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిని డబ్ల్యూహెచ్‌ఓ వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్‌గా మాత్రమే పరిగణిస్తోంది. ఈ వేరియంట్‌లతో వ్యాధి తీవ్రత ఎక్కువనేందుకు ఆధారాలు ఏవీ లేవని నిపుణులు చెబుతున్నారు.  అయితే, త్వరగా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకే అవకాశం మాత్రం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటి బారిన పడ్డ వారిలో జ్వరం, ముక్కు కారడం, గొంతులో ఇబ్బంది, తలనొప్పి, అలసట, నీరసం వంటి సాధారణ ఫ్లూ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.