118 పాకిస్థానీ ఫార్వ‌ర్డ్ పోస్టుల‌ను ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్

118 పాకిస్థానీ ఫార్వ‌ర్డ్ పోస్టుల‌ను ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్

ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో బీఎస్ఎఫ్ ద‌ళాలు పాకిస్థాన్‌కు చెందిన 118 ఫార్వ‌ర్డ్ పోస్టులను, వాటి నిఘా వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేసిన‌ట్లు  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్ర‌శంస‌లు కురిపించారు. పొరుగు దేశానికి బీఎస్ఎఫ్ గ‌ట్టి జ‌వాబు ఇచ్చింద‌ని పేర్కొన్నారు. అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రిప‌రేష‌న్ గురించి జ‌మ్మూక‌శ్మీర్‌లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న చేప‌ట్టిన ఆయ‌న మాట్లాడుతూ పాకిస్థాన్ దూకుడుకు బీఎస్ఎఫ్ ద‌ళాలు బ‌ల‌మైన ప్ర‌తిస్పంద‌న ఇచ్చాయ‌ని కొనియాడారు. 

త‌క్కువ స‌మ‌యంలోనే అధిక సంఖ్య‌లో ఫార్వ‌ర్డ్ పోస్టుల‌ను ధ్వంసం చేయ‌డం అసాధ‌ర‌ణ‌మైన ప‌ని అని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ కోలుక‌వ‌డానికి చాలా ఏండ్లు ప‌డుతుంద‌ని, ఒక్కొక్క‌టిగా ఆ దేశ నిఘా వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసిన‌ట్లు చెప్పారు. క‌నీసం ఆ దేశానికి కోలుకునేందుకు నాలుగైదు ఏండ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.

“బీఎస్ఎఫ్ భారతదేశపు మొదటి రక్షణ శ్రేణిగా పనిచేస్తుంది. ఎడారులు, పర్వతాలు, అడవులు సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో అచంచలమైన అంకిత భావంతో బీఎస్ఎఫ్ పనిచేస్తోంది. భారత సరిహద్దులపై ఏ రకమైన దాడి జరిగినా, అది వ్యవస్థీకృతమైనా, అసంఘటితమైనా, రహస్యమైనా, బహిరంగమైనా సరే- మొదట దానిని ఎదుర్కొనేది బీఎస్ఎఫ్ జవాన్లే. వారి శౌర్యం, త్యాగం ప్రశంసనీయం” అని అమిత్ షా కొనియాడారు. 

కాగా, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన అభివృద్ధి కొనసాగుతుందని అమిత్‌ షా స్పష్టం చేశారు. భారత్‌కు హాని తలపెట్టాలని చూసిన వారికి తగిన రీతిలో సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఫూంచ్‌ జిల్లాలో పర్యటించిన అమిత్‌ షా, పాకిస్థాన్‌ దాడుల్లో దెబ్బతిన్ని ప్రాంతాలను పరిశీలించారు. ఈ దాడుల్లో మరణించినవారి కుటుంబాలను పరామర్శించిన అమిత్‌ షా వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. 

అనంతరం బాధిత కుటుంబాల్లోని యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. పాక్ దాడుల సమయంలో కశ్మీరీ పౌరులు, అధికారులు చూపిన ధైర్యం, దేశభక్తి దేశానికి మరింత బలాన్నిచ్చాయని అమిత్ షా పేర్కొన్నారు. దెబ్బతిన్న ప్రాంతాలకు కేంద్రం త్వరలోనే పునరావాస ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దాడుల సమయంలో పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్ర అధికార యంత్రాంగం చురుకుగా పనిచేసిందని అమిత్ షా ప్రశంసించారు.