
పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కరడుగట్టిన టెర్రరిస్ట్‌లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్ లను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. గోవాలోని విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో, నావికాదళ సభ్యులతో భేటీ అయిన రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ ఏమాత్రం వెనుకాడదని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ కనీసం ఊహించలేని అన్ని పద్ధతులను ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఉపయోగిస్తామని పేర్కొన్నారు. భారత నౌకాదళం పరాక్రమాన్ని పాకిస్థాన్ ఇంకా చూడలేదని రాజ్‌నాథ్ హెచ్చరించారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ ఆలోచించగల ప్రతి పద్ధతిని మేము వాడతాం. అంతేకాదు పాకిస్తాన్ కనీసం ఆలోచించలేని పద్ధతులను కూడా ఉపయోగించడానికి మేము వెనుకాడం”అని తెలిపారు.
సమగ్రమైన రీతిలో సాగిన ఆపరేషన్‌లో భారతీయ నౌకాదళ పాత్ర కూడా అద్భుతమైందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పాకిస్థానీ నేలపై ఉన్న ఉగ్ర స్థావరాలను ఐఏఎఫ్ ధ్వంసం చేస్తే, ఆరేబియా సముద్రంలో ఉన్న భారత యుద్ధ నౌకలు పాకిస్థానీ నేవీని తీరానికి పరిమితం చేశాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, అది ఉగ్రవాదంపై మూకుమ్మడి దాడి అని పేర్కొన్నారు.
చాలా తక్కువ సమయంలోనే పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను, వాళ్ల ఉద్దేశాలను ధ్వంసం చేశామని చెబుతూ మనం ఎంతో శక్తివంతమైన దాడి చేశామని, ఆ దాడుల్ని విరమించుకునేలా చేయాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను వేడుకున్నదని రాజ్‌నాథ్ తెలిపారు. మన సైనిక దళాలు ఎంతో వేగంగా, గాఢాంగా, స్పష్టమైన దాడులు చేశాయని, అసాధారణ రీతిలో ఆ దాడులు జరిగినట్లు చెప్పారు.
ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులకే కాదు, వాళ్లను పెంచి పోషించే వాళ్లకు కూడా స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలిపారు. పాక్ ఉగ్రవాదులను నాశనం చేసేందుకు ఏ పద్ధతినైనా అనుసరిస్తామని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. పాక్ ఊహించలేని పద్ధతుల్లో ఆ చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాకిస్థాన్ ఆడుతున్న ప్రమాదకర ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసిందని తేల్చి చెప్పారు.
పాక్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద నర్సరీలను నిర్మూలించాలని, ఇది పాకిస్థాన్‌కే ప్రయోజనకరమని రాజ్‌నాథ్ సింగ్ హితవు పలికారు. “పాకిస్థాన్ నేల నుంచి బహిరంగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. సరిహద్దు, సముద్ర మార్గాల ద్వారా ఉగ్రవాదులపై ఎలాంటి ఆపరేషన్ నిర్వహించడానికైనా భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది.” అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
“ప్రపంచ దేశాలు అన్నీ తమ పౌరులను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కును భారత్ గుర్తిస్తోంది. కనుక నేడు ప్రపంచంలోని ఏ శక్తీ భారత్ ఈ పని చేయకుండా ఆపలేదు” అని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కాగా, కేవలం తమ సొంత షరతుల ప్రకారం, సైనిక చర్యను (ఆపరేషన్ సిందూర్)ను ఆపేశామని రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు