మావో కీలక నేత హిడ్మా ఎట్టకేలకు అరెస్ట్

మావో కీలక నేత హిడ్మా ఎట్టకేలకు అరెస్ట్
 
మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ అయిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. మ‌రో కీల‌క నేత‌ను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్ జిల్లాలోని జ‌న‌గూడ‌కు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. 
 
ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంట‌రీ ఫోర్స్ బృందాలు ప్ర‌త్యేక ఆపరేష‌న్ చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో బోయిప‌రిగూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని పెట‌గూడ గ్రామ స‌మీపంలోని అడ‌వుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచ‌రిస్తున్నార‌ని ప‌క్కా స‌మాచారం అంద‌డంతోనే.. పోలీసులు అక్క‌డ కూంబింగ్ నిర్వ‌హించిన‌ట్లు ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.

కూంబింగ్ నిర్వ‌హిస్తుండ‌గా పోలీసుల‌కు మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. దీంతో మావోయిస్టుల‌కు, పోలీసు బ‌ల‌గాల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే చాలా మంది మావోయిస్టులు అక్క‌డ్నుంచి పారిపోయారు. మావోయిస్టు కుంజాం హిడ్మా మాత్రం అక్క‌డున్న చెట్ల పొద‌ల్లో త‌ల‌దాచుకున్నాడు. పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. 

ఆ త‌ర్వాత అత‌ను హార్డ్‌కోర్ మావోయిస్టు హిడ్మా అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కుంజాం హిడ్మా ప్ర‌స్తుతం ఏరియా క‌మిటీ మెంబ‌ర్‌గా కొన‌సాగుతున్నారు.  ఈ ప్రాంతంలో జరిగిన ఏడు ప్రధాన హింసాత్మక సంఘటనలతో అత‌ను నిందితుడు.. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆపరేషన్ మరింత దూకుడుగా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఏవోబీ ప్రాంతంవైపు కూడా పెద్ద ఎత్తున దృష్టిసారించారు భద్రతా బలగాలు.

హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్, 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎల‌క్ట్రానిక్ డిటోనేట‌ర్స్, 90 నాన్ ఎల‌క్ట్రిక్ డిటోనేట‌ర్స్, 2 కేజీల గ‌న్ పౌడ‌ర్, రెండు స్టీల్ కంటైన‌ర్స్, రెండు రేడియోలు, ఒక ఇయ‌ర్ ఫోన్, వాకిటాకీ, బ్యాట‌రీ, రెండు క‌త్తులు, గొడ్డ‌లి, నాలుగు టార్చ్ లైట్లు, ఒక పాలిథీన్ క‌వ‌ర్, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్త‌కాలు ల‌భించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.