
చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక కడపతో కలుపుకుని ఇప్పటివరకు 25 మహానాడులు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లు జూమ్ ద్వారా మహానాడు నిర్వహించారు. చంద్రబాబును 12వ సారి టీడీపీ అధినేతగా మహానాడు ఎన్నుకుంది. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని, రానున్న 40 ఏళ్లకు ప్రణాళికలు రూపొందించుకున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.
ఫ్యాక్షనిజం, నక్సలిజాన్ని తుదముట్టించిన పార్టీ టీడీపీ అని పేర్కొంటూ గత ఐదేళ్లు ఏపీలో శాంతిభద్రతలు లేవని, వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయిని హత్య చేసి ఆ నింద మనపై మోపాలని చూశారని, అయితే తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో పి4 ద్వారా పేదరికం లేని సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. పార్టీ భవిష్యత్ తరానికి బలమైన పునాదులు వేస్తున్నామన్న చంద్రబాబు పార్టీలోని కోవర్టులకు మహానాడు వేదికగా గట్టి హెచ్చరిక చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవర్టులుగా పని చేస్తున్నారని, వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ టీడీపీ వారు సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ పార్టీకి చెడ్డపేరు తెచ్చి, సులభంగా వారి టార్గెట్లను హత్య చేస్తున్నారని కోవర్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువాడి గుర్తింపును, పౌరుషాన్ని చాటిచెప్పడమేగాకుండా సంక్షేమానికి అసలైన నిర్వచనం ఎన్టీఆరేనని చంద్రబాబు కీర్తించారు. టీడీపీ ప్రయాణం శాశ్వతమని, పార్టీ ప్రస్థానానికి ఎదురుఉండబోదని స్పష్టం చేశారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ