ఎంపీ మంత్రి విజయ్‌ షాకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎంపీ మంత్రి విజయ్‌ షాకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షాకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. అదే సమయంలో విచారణను నిలిపివేయాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆదేశించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మీడియాకు బ్రీఫింగ్‌ ఇచ్చిన కర్నల్‌ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్‌ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై కేసు నమోదైంది. 
 
దాంతో విజయ్‌ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు అరెస్టు చేయకుండా ఊరటనిచ్చింది. ఇదే కేసులో బుధవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. కున్వర్ విజయ్ షా అరెస్టును నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పొడిగించింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విచారణలను నిలిపివేయాలని ఆదేశించింది. 
 
మరో వైపు ముగ్గురు ఐపీఎల్‌ అధికారులను కూడిన సిట్‌ ఏర్పాటు చేసినట్లు డీఐజీ పోలీసులకు సమర్పించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. దర్యాప్తు మే 21న ప్రారంభమైందని.. మరిన్ని పత్రాలను సేకరించాలని ఉందని సిట్‌ నివేదిక పేర్కొంది. 
 
సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని, దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని రిపోర్టులో తెలిపారు. గత విచారణ సమయంలో సిట్‌ దర్యాప్తు స్టేటస్‌ రిపోర్ట్‌ను కోరింది. సిట్ కొన్ని పరికరాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించిందని కోర్టు పేర్కొంది. విజయ్ షా అరెస్టుతో సహా మే 19న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగించినట్లు పేర్కొంది. 
 
కేసులో తదుపరి విచారణను జులై రెండోవారంలో నిర్వహించాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో ఎలాంటి జోక్యాన్ని అనుమతించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని సూచించింది. కర్నల్‌ సోఫియా ఖురేషి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంత్రిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల సిట్‌ను ఏర్పాటు చేసింది.