వడ్ల కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

వడ్ల కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ రైతుల ఉసురుతీస్తుందని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ వ్యవసాయ కమిషనరేట్ కు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారులు రైతు నాయకులతో కలసి డైరెక్టర్ గోపికి డిమాండ్లతో కూడిన మెమరాండం సమర్పించారు. 

ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కి రైతులను రేవంత్ సర్కారు నట్టేట ముంచిందని రైతు భరోసా పేరుతో ఎకరానికి 15000 ఇస్తానన్న ప్రభుత్వం మొఖం సాటేసిందని ధ్వజమెత్తారు. రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేస్తామని 40 శాతం కూడా మాఫీ ప్రక్రియను పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు. 

వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని ప్రగల్బాలు పలికి మాట తప్పారని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు బోనసిస్తామని మాట మార్చారని శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయినప్పుడు ఆదుకునే అవకాశం లేకుండా పోయిందని ఆయన విచారణ వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరిచిందని పేర్కొంటూ ఈ వాన కాలం నుండైనా ప్రధానమంత్రి పంటల బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని చెబుతూ ప్రధానంగా మిల్లర్లతో కుమ్మక్కై వడ్ల కొనుగోలు ను నిర్వీర్యం చేశారని వడ్ల కొనుగోలు కేంద్రాలలో కనీసం టార్పాలిని పట్టాలి ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం వడ్లకు మంచి మద్దతు ధర ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సైంధవుడు పాత్ర పోషించిందని పేర్కొంటూ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, పాపన్న గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు పడమటి జగన్మోహన్ రెడ్డి, మరిపల్లి అంజయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మారుతీ కిరణ్ గౌడ్ దేవర శ్రీనివాస్ సింగిడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు నరసింహారెడ్డి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు