
ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జరిపిన రాయబారం విఫలమైన్నట్లు తెలుస్తున్నది. సోమవారం వరుసగా కేసీఆర్ కుటుంబంతో బంధుత్వం గల ఇద్దరు పార్టీ నాయకులు ఆమెను కలిసి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా, కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడించినా పార్టీలో, భవిష్యత్ లో ఏర్పడే పార్టీ ప్రభుత్వంలో తన స్థానం ఏమిటో ఇప్పుడే స్పష్టం చేయాలని ఆమె పట్టుబట్టినట్లు తెలుస్తున్నది.
పార్టీలో తన పరిస్థితిపై ముందే స్పష్టత ఇవ్వాలని, లేకపోతే తన దారి తాను చూసుకుంటానని కాస్త ఘాటుగానే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆమె వ్రాసిన లేఖ వివాదం సృష్టించడంతో ఆదివారం కేటీఆర్‌ను పిలిపించుకుని కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కవిత లేఖ విషయమై పార్టీ వారెవ్వరూ మాట్లాడవద్దని ఆదేశించారు.
తొలుత, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ ఎంపీ దివికొండ దామోదర రావు సోమవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సంప్రదింపులకు వచ్చానని ఆయన కవితకు స్పష్టం చేసినట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. కొంతసేపు చర్చించిన తర్వాత ఆయన వెళ్లిపోయారు. అనంతరం, పార్టీ లీగల్ సెల్ బాధ్యతలు చూసే గండ్ర మోహన్‌రావు కవిత నివాసానికి చేరుకున్నారు. ఆయన కూడా కొంతసేపు మాట్లాడి వెళ్లిపోయారు.
కేసీఆర్ పంపిన ఇద్దరు దూతలూ ఒకరి తర్వాత మరొకరు కవితతో మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు మూడు గంటలపాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ నడిచినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి జరిగే నష్టం వంటి విషయాలతోపాటు ఎవరికి వారుగా ఉంటే ఎదురయ్యే సమస్యలపై అధినేత కేసీఆర్ చేసిన సూచనలను వారు కవితకు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
చర్చల్లో భాగంగా కేసీఆర్‌తోనూ ఫోన్లో మాట్లాడించినట్లు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. పదవులు, హోదాల విషయంలో తొందరపడవద్దని ఆమెకు కేసీఆర్ సూచించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అయినా, కవిత మెత్తబడలేదని జాగృతి వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా రెండు, మూడు అంశాలపై కవిత చాలా పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు తన సంగతేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కేటీఆర్ సీఎం అయితే పార్టీలో గానీ, ప్రభుత్వంలోని గానీ తనకు ఇచ్చే హోదా ఏమిటో ఇప్పుడే స్పష్టత ఇవ్వాలని కవిత పట్టుబట్టినట్లు జాగృతి వర్గాలు వెల్లడించాయి.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?