
పేలుళ్ల కుట్ర కేసు నిందితులు సిరాజ్, సమీర్ల నాలుగో రోజు విచారణ విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలోనే కొనసాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన దర్యాప్తులో పేలుళ్లకి సంబంధించి కీలక అంశం వెలుగు చూసింది. విజయనగరమే తన మొదటి టార్గెట్ అని, ప్రశాంతమైన విజయనగరంలో ముస్లిమేతరులు అధికంగా ఉన్న ప్రాంతాలే తన లక్ష్యంగా నిర్ణయించున్నానని సిరాజ్ వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్‌లో “అహీమ్” సంస్థను ఏర్పాటు చేసిన సిరాజ్, సమీర్, పేలుళ్ల కుట్రకు ఐదు రాష్ట్రాల్లో రెక్కీ నిర్వహించినట్లు మూడో రోజు విచారణలో దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబయిలలో రెక్కీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రాంతాల్లో ఏపీలో విజయనగరం ఎంపికపై ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు నాలుగో రోజు లోతుగా విచారణ చేశారు.
ఈ సందర్భంగా సౌదీ, ఒమన్ హ్యాండ్లర్లు, హైదరాబాద్‌లో పేలుళ్లు జరపాలని ఆదేశించారని తెలిపాడు. దీని కోసం సౌదీలో శిక్షణ సైతం పొందానని, అయితే విజయనగరమే తన తొలి టార్గెట్ అని హ్యాండర్లను ఒప్పించినట్లు సిరాజ్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలో విజయనగరంలోని అత్యంత జనసందోహ ప్రాంతాలైన మూడు లాంతర్లు, గంటస్తంభం, అష్టలక్ష్మీ కోవెల, రైల్వేస్టేషన్ కూడళ్లను ఎంపిక చేసుకున్నట్లు దర్యాప్తు అధికారుల విచారణలో సిరాజ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
అత్యంత జనసందోహం నెలకొన్న ప్రాంతాల్లో పేలుళ్ల కుట్రకు పాల్పడిన ప్రధాన నిందితుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్ చిక్కడంతో విజయనగరం పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబులు తయారీకి ఉపక్రమిస్తున్న సమయంలోనే ఉగ్రకుట్రను పసిగట్టడంతో పెద్ద గండం తప్పింది. పేలుడు పదార్థాలు, వాటికి అవసరమైన పీవీసీ పైప్ ముక్కలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసి పేలుళ్లకు ఉపక్రమించిన సమయంలో మెరుపుదాడి చేసి పట్టుకున్నారు.
ఇదే విషయాన్ని విజయనగరం రెండో పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఏదీ ఏమైనా నిఘా వర్గాల అప్రమత్తతతో విజయనగరానికి భారీ పేలుళ్ల ముప్పు తప్పింది. అయితే ఐదో రోజు కొనసాగనున్న సిరాజ్, సమీర్ విచారణలో పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి మరిన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం