షర్మిల, కవితలను కాంగ్రెస్ పావులుగా వాడుకుంటోంది

షర్మిల, కవితలను కాంగ్రెస్ పావులుగా వాడుకుంటోంది

ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల, తెలంగాణలో కవితలను కాంగ్రెస్ పార్టీ పావులుగా వాడుకుంటోందని బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ విమర్శించారు. అక్కడా, ఇక్కడా కూడా అన్నలపైకి చెల్లెళ్లను కాంగ్రెస్ ఉసిగొల్పుతోందని ఆరోపించారు.  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాల కుటుంబాల పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారని, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో కుటుంబాల్లో వివాదాలు తలెత్తాయని ఆరోపించారు.

ఈ వివాదాల కారణంగానే ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడుతున్నారని తెలిపారు. ఒకప్పుడు అన్నల కోసం, వదినల కోసం బాణాలుగా మారిన చెల్లెళ్లు, ఇప్పుడు అధికారం, ఆస్తుల కోసం అన్నల మీదే బాణాలు గురిపెట్టే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాల కంటే తమ కుటుంబ అవసరాలు, వారసత్వమే ముఖ్యమనే విధంగా ఈ రెండు కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోగానే, వైఎస్ షర్మిలను ఆయనపైకి ఉసిగొల్పి, ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని లక్ష్మణ్ గుర్తు చేశారు.  అదేవిధంగా, తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను కూడా కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పావుగా వాడుకుంటోందనే వాదన బలపడుతోందని లక్ష్మణ్ పేర్కొన్నారు. 

తండ్రులు సంపాదించిన అక్రమాస్తులు, అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలే ఈ కుటుంబ వివాదాలకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత కుట్రలు పని చేయవని చెబుతూ  కెసిఆర్‌కు కవిత రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు.

తెలంగాణ బీఆర్‌ఎస్‌లో కెటిఆర్ నాయకత్వాన్ని కవిత వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు. పదేళ్లుగా సామాజిక న్యాయం గురించి కవిత మాట్లాడలేదని, అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే భయంతో కవితతో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పావులు కదుపుతోందని లక్ష్మణ్ ఆరోపించారు. ఆంద్రప్రదేశ్‌లో షర్మిలను కూడా కాంగ్రెస్ ఇలానే వాడుకుందని గుర్తు చేశారు. అస్తిత్వం కోసమే కవిత పోరాటం చేస్తుందని, లిక్కర్ కేసుల్లో ఉన్న వారిని ప్రజలు స్వాగతించరని స్పష్టం చేశారు.