
కరోనా కలవరం మళ్లీ మొదలయ్యింది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం అన్ని రాష్ట్రాలను భయాందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా కారణంగా శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాయి.
మే నెలలో ఇప్పటివరకు కేరళలో అత్యధికంగా 273 కరోనా కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేసులు, తెలంగాణలో 1 కేసు నిర్ధారణ అయ్యాయి. ఈ ఆందోళనను మరింత పెంచేలా ఇండియన్ సార్స్ కరోనా వైరస్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) శనివారం కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) శనివారం ప్రకటించింది.
ఎన్‌బీ.1.8.1 రకం కేసు ఏప్రిల్ నెలలో వెలుగు చూడగా, ఎల్‌ఎఫ్.7 వేరియంట్‌కు సంబంధించిన నాలుగు కేసులు మే నెలలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో నమోదైనట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే, కేసులు నమోదవుతున్నప్పటికీ, వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది.
అయినప్పటికీ, పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను పర్యవేక్షణలో ఉన్న కరోనా సబ్ వేరియంట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. నిపుణులు నిశితంగా వాటిని పర్యవేక్షించి నివేదిక ఇచ్చిన తర్వాతే అవి ప్రమాదకరమైనవా ? కావా ? అనే దానిపై స్పష్టత వస్తుంది.
వైద్య నిపుణుల కథనం ప్రకారం, జేఎన్1 అనేది ఒమైక్రాన్ సబ్ వేరియంట్. దీనికి వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉంది. ఇది సోకితే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, వాసనను గుర్తించలేకపోవడం, నోటి రుచిని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వేరియంట్ వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇది సోకిన వారు త్వరగా కోలుకుంటారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా రాదు.
More Stories
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు