24 గంటల్లో 5,88,107 పాలసీలతో ఎల్‌ఐసీ ప్రపంచ రికార్డు

24 గంటల్లో 5,88,107 పాలసీలతో ఎల్‌ఐసీ ప్రపంచ రికార్డు

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది. 24 గంటల్లో 5,88,107 జీవిత బీమా పాలసీలు జారీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎల్‌ఐసీ. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఈ సంవత్సరం జనవరి 24న దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఎల్‌ఐసీ ఏజెంట్లు కలిసి 24 గంటల్లో మొత్తం 5,88,107 జీవిత బీమా పాలసీలను జారీ చేశారని, ఇది ఓ ప్రపంచ రికార్డు అని జీవిత బీమా సంస్థ తెలిపింది. ఈ ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైని పేర్కొంది. ఇది ఘనత తమ ఏజెంట్ల అంకితభావం, నైపుణ్యం, అవిశ్రాంత కృషికి నిదర్శనమని ఎల్‌ఐసీ చెప్పుకొచ్చింది.

ఈ గొప్ప ప్రయత్నం కేవలం 24 గంటల్లోనే జీవిత బీమా పరిశ్రమలో కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని, ఈ విజయం మా కస్టమర్లకు, వారి కుటుంబాలకు కీలకమైన ఆర్థిక భద్రతను అందించే మా లక్ష్యం పట్ల తమ లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ రికార్డు కోసం ఎల్‌ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ్ మొహంతి చొరవ చూపారు.  ఈ ఏడాది జనవరి 20న ‘మ్యాడ్ మిలియన్ డే’ రోజున ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీని పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మ్యాడ్ మిలియన్ డే’ని చారిత్రాత్మకంగా మార్చినందుకు కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు మొహంతి కృతజ్ఞతలు తెలిపారు.