ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది భారత్. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ పేరుతో అక్కడి ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అంటకాగుతున్న పాక్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టించింది. డ్రోన్లు, మిసైళ్ల దాడులతో శత్రుదేశానికి నిద్రలేకుండా చేసింది. ఇప్పుడు పాక్‌పై దౌత్య యుద్ధానికి కసరత్తులు చేస్తోంది.
ఇందులో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ దేశాల ముందు పాక్ బండారాన్ని బయటపెట్టేందుకు, ఆ దేశ ఉగ్ర కుట్రల్ని అందరికీ అర్థమయ్యేలా విశదీకరించేందుకు 7 అఖిలపక్ష ఎంపీల బృందాలను ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల జాబితాలో పేర్కొనకపోయినా మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ శశిథరూర్ని అనూహ్యంగా ఎంపిక చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు వివిధ రాజకీయ పార్టీల ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు శశిథరూర్ ఉన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరిక మేరకు ఆయా పార్టీలు తమ నేతల పేర్లను ప్రభుత్వానికి పంపారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. నిన్న ఉదయం (మే 16) పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌లతో మాట్లాడినట్లు చెప్పారు. పాక్ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచదేశాలకు వివరించేందుకు విదేశాలకు పంపే ప్రతినిధుల బృందాలకు నలుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని కోరినట్లు చెప్పారు.
ఆయన విజ్ఞప్తి మేరకు నిన్న మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజ బ్రార్ పేర్లను పంపినట్లు చెప్పారు. కాంగ్రెస్ పంపిన ప్రతిపాదనలో థరూర్ పేరు లేదని వెల్లడించారు. అయితే, కేంద్రం అనూహ్యంగా ఆయన్ని ఎంపిక చేసిందంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం తన పేరును ప్రకటించడంపై వెంటనే శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు. అఖిలపక్ష బృందాన్ని నడిపించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందని, పహల్గాం దాడి నుంచి ఇటీవల చోటుచేసుకున్న కార్యకలాపాలపై భారత వైఖరిని ప్రపంచ దేశాల ముందు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దేశానికి తన సేవలు అవసరమైనప్పుడు తప్పకుండా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. దీంతో థరూర్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది.
అమెరికాకు వెళ్లే ప్రతినిధి బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తారు.ఈ బృందంలో సభ్యులు శాంభవి చౌదరి, సర్ఫరాజ్ అహ్మద్, సుదీప్ బందోపాధ్యాయ, హరీష్ బాలయోగి, శశాంక్ మణి త్రిపాఠి, భువనేశ్వర్ కలిత, మిలింద్ దేవరా ఉన్నారు.ఈ బృందంలో అమెరికాలోని మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు, హిందూ మహాసముద్ర ప్రాంత డైరెక్టర్ వరుణ్ జెఫ్ కూడా ఉన్నారు. వీరు ప్రతినిధి బృందానికి అనుసంధాన అధికారిగా వ్యవహరిస్తారు.
జపాన్‌కు వెళ్లే భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి జనతాదళ్ యునైటెడ్ పార్లమెంటు సభ్యుడు సంజయ్ ఝా నాయకత్వం వహిస్తారు.ఈ బృందంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, రిటైర్డ్ దౌత్యవేత్త మోహన్ కుమార్, మాజీ క్రికెటర్, ప్రస్తుత ఎంపీ యూసుఫ్ పఠాన్, ఎంపీలు హిమాంగ్ జోషి, జాన్ బ్రిట్టాస్ (సిపిఎం), విక్రమ్‌జిత్ వర్ష్నే, ప్రధాన్ బారువా, బీజేపీ నుండి అపరాజిత సారంగి ఉన్నారు. ఐరోపా బృందానికి బైజయంత్ పాండా, రష్యాకు కనిమొళి, ఆఫ్రికాకు శ్రీకాంత్ షిండే, గల్ఫ్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ నాయకత్వం వహిస్తారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం