భారత్‌తో ఆఫ్ఘన్ సంబంధాల పునరుద్ధరణ

భారత్‌తో ఆఫ్ఘన్ సంబంధాల పునరుద్ధరణ

భారత్‌తో సంబంధాలకు పునరుద్ధరణ, పరస్పర సహకారం, పెట్టుబడులకు ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆసక్తితో ఉన్నట్టు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్  శుక్రవారంనాడు తెలిపారు. ఇంతకుముందు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ తొలిసారి ఫోనులో సంభాషించారు. అనంతరం భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఆసక్తితో ఉన్నట్టు సుహైల్ షహీన్ ప్రకటించారు.

ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం 2021 ఆగస్టులో అధికార పగ్గాలు చేపట్టింది. ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించనప్పటికీ దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. అయితే మంత్రుల స్థాయిలో జైశంకర్, ముత్తాఖి మధ్య అత్యున్నత స్థాయిలో ఫోన్ సంభాషణలు చోటుచేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. దీనికి ముందు ముత్తాఖీ, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మధ్య గత జనవరి దుబాయిలో చర్చలు జరిగాయి. 

ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించడంతో రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. జైశంకర్, ముత్తాఖీ మధ్య ఫోను సంభాషణల ప్రాధాన్యతపై సుహైల్ షహీన్‌ను ప్రశ్నించినప్పుడు, ఇండియాతో ఆప్ఘన్‌కు చారిత్రక సంబంధాలున్నాయని, వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

ఆప్ఘన్ ప్రభుత్వం బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ విధానాన్ని అనుసరిస్తుందని, తమ దేశంలోని వివిధ రంగాల్లో ఏ దేశమైనా పెట్టుబడులు పెట్టేందుకు వీలుందని తెలిపారు. ఇండియా-ఆఫ్ఘన్ మధ్య ప్రస్తుతం ఒక బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వాణిజ్యం ఉంది. కాగా, పహల్గాం ఉగ్రదాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండించడాన్ని స్వాగతిస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. ఆఫ్ఘన్ ప్రజలతో సత్సబంధాలను కొనసాగించడంతో పాటు వారి అభివృద్ధికి నిరంతరం మద్దతు ఇందిస్తామని చెప్పారు.

ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లే అశాలపై తాను, ముత్తాఖీ చర్చలు జరిపినట్టు చెప్పారు.  కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా సరిహద్దులు మూసివేయడంతో పాకిస్థాన్‌లో నిలిచిపోయిన 150 అఫ్గాన్‌ సరకు రవాణా ట్రక్కులను వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారత్‌ వచ్చేందుకు అనుమతించారు. వీటిలో అధిక శాతం డ్రై ఫ్రూట్స్‌ తీసుకువచ్చేవే. ఇప్పటికే 8 ట్రక్కులు భారత్‌ చేరుకున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు తెలిపారు.

2021 నుంచి ఆప్ఘన్‌కు భారత్ 50,000 టన్నుల గోధుమలు, 350 టన్నుల మెడిసన్లు, 40,000 లీటర్ల మలాథియాన్ పెస్టిసైడ్స్, 29 టన్నుల భూకంప సహాయక సామగ్రి పంపింది. ఆప్ఘన్ విద్యార్థులకు 2,000 ఆన్‌లైన్ స్కాలర్‌షిప్‌లు కూడా ఇచ్చింది.