
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వేళ పాక్‌కు మద్దతిచ్చిన తుర్కియే, అజర్బైజాన్ లతో అన్ని రకాల వాణిజ్య, వర్తక సంబంధాలను బహిష్కరించాలని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ (సిఎఐటి) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ట్రావెల్, టూరిజం సహా ఆ దేశంతో అన్ని సంబంధాలను పూర్తిగా బహిష్కరణ చేస్తున్నట్టు సీఏఐటీ నిర్వహించిన నేషనల్ ట్రేడ్ కాన్ఫరెన్స్‌లో 125కు పైగా అగ్రశేణి వాణిజ్య నేతలు నిర్ణయించారు.
టర్కీ, అజర్బైజాన్లలో సినిమాలు షూటింగ్ చేయవద్దని కూడా భారత చలనచిత్ర పరిశ్రమకు ట్రేడ్ కమ్యూనిటీ విజ్ఞప్తి చేసింది. అక్కడ సినిమాలు షూట్ చేస్తే ట్రేడ్ కమ్యూనిటీతోపాటు, ప్రజలంతా ఆ చిత్రాలను బహిష్కరిస్తారని హెచ్చరించింది. ఆ దేశాల్లో ఉత్పత్తి ప్రమేషన్లను ఏ కార్పొరేట్ సంస్థ షూట్ చేయరాదని సైతం సదస్సులో నిర్ణయించారు
సీఏఐటీ ట్రేడ్ కాన్ఫరెన్స్‌లో 24 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావం తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా నిలిచే శక్తులను వ్యతిరేకించాలని ప్రతినబూనారు. భారతదేశం ఇటీవల తీవ్రమైన జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొన్న సమయంలో పాక్‌కు తుర్కియే, అజర్బైజాన్ దేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ దేశాలు సంక్షోభంలో పడినప్పుడు ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మానవతాసాయంతోపాటు దౌత్యపరంగా ఆదుకుందని, అయితే ఈ రెండు దేశాలు భారత్ పట్ల వంచనకు పాల్పడ్డాయని వాణిజ్య వర్గాలు విమర్శలు గుప్పించాయి.
భారతదేశ గుడ్‌విల్, అసిస్టెన్స్, వ్యూహాత్మక మద్దతు వల్ల తుర్కియే, అజర్బాజాన్ ప్రయోజనం పొంది ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదానికి పెట్టింది పేరైనా పాకిస్థాన్‌కు మద్దతు పలకడం దురదృష్టకరమని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ప్రవీణ్ ఖండేల్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుర్కియే, అజర్బైజాన్ చర్యలను భారతదేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలపై దాడిగా ఆయన అభివర్ణించారు. 140 కోట్ల భారతీయుల భావోద్వేగాలపై దాడి జరిపారని తప్పుపట్టారు.
అంతర్జాతీయ వేదికలపై తుర్కియే భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, తుర్కియేతో అజర్బైజాన్ అంటకాగుతూ పాక్ ప్రజలకు మద్దతివ్వడం భారత మంత్రి సహకారాలను అగౌరవపరచడమేనని సదస్సులో ట్రేడ్ నేతలు విమర్శించారు. ఈ చర్యలను భారత వ్యతిరేక చర్యలుగా భావిస్తున్నట్టు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారితియా పేర్కొన్నారు.
ఇలాంటి దేశాలకు భారత్ ఎలాంటి ఆర్థికసాయం కానీ, ట్రేడ్ ప్రయోజనాలు కానీ కల్పంచరాదని సదస్సు ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు చెప్పారు. తుర్కియే కంపెనీ సెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ట్రేడర్లు స్వాగతించారు. తొమ్మిది ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌లను ఈ సంస్థ ఆపరేట్ చేస్తోంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా