ఆప‌రేష‌న్ సిందూర్ ట్రైల‌ర్ మాత్రమే

ఆప‌రేష‌న్ సిందూర్ ట్రైల‌ర్ మాత్రమే
ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌తో ట్రైలర్‌ మాత్రమే చూశారని, సినిమా ముందుందని తీవ్రంగా హెచ్చరించారు. గుజరాత్ లోని భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేష‌న్‌ను శుక్రవారం  రాజ్‌నాథ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్‌ వారియర్స్‌ తో సంభాషించరు.  అనంతరం అక్కడ ప్రసంగీస్తూ ‘ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదు. ఇప్పటి వరకూ ఏదైతే చూశారో అది కేవలం ట్రైలర్‌ మాత్రమే. సరైన సమయంలో ప్రపంచం మొత్తానికి పూర్తి సినిమా చూపిస్తాం’ అని వ్యాఖ్యానించారు. 
ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో భార‌తీయ మిలిట‌రీ నిర్వ‌హించిన పాత్ర‌ను దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా ప్ర‌శంస‌లు వ‌స్తున్న‌ట్లు చెప్పారు.  ఆప‌రేష‌న్ సింధూర్‌తో శత్రు దేశాన్ని డామినేట్ చేయ‌డ‌మే కాదు, దాన్ని పూర్తిగా నాశ‌నం చేసిన‌ట్లు చెప్పారు. ఉగ్ర‌వాదంపై మ‌న వైమానిక ద‌ళం త‌న ఆప‌రేష‌న్‌ను ప్ర‌భావ‌వంతంగా నిర్వ‌హించింద‌ని పేర్కొన్నారు. మ‌న వైమానిక ద‌ళం త‌న స‌త్తా, ధైర్యంతో కొత్త ద‌శ‌కు చేరుకున్న‌ట్లు రాజ్‌నాథ్ వెల్ల‌డించారు.

“పాకిస్థాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్‌ 23 నిమిషాల్లోనే తుడిచిపెట్టేసింది. త్రివిధ దళాల పరాక్రమం చూసి యావత్‌ భారతావని గర్విస్తోంది. ఈ ఆపరేషన్‌తో భారత్‌ సైనిక సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది” అని రక్షణ మంత్రి తెలిపారు.  “పాకిస్తాన్‌ను ఇప్పుడు ప్రొబేషన్ పీరియడ్‌లో పెట్టాము. పాక్ తన బుద్ధి మార్చుకుంటే పర్లేదు. లేకపోతే కఠినమైన శిక్షలు వేస్తాం” అని హెచ్చరించారు.

“పాక్‌లోని ప్రతి మూలకూ వెళ్లే సామర్థ్యం మన వైమానిక దళానికి ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌తో అది నిరూపితమైంది. ఈ ఆపరేషన్‌తో మ‌న వైమానిక సామ‌ర్థ్యాన్ని పాక్‌ ప్రత్యక్షంగా చూసింది. పాకిస్థాన్ నేల‌పై ఉన్న 9 ఉగ్ర స్థావరాలను మ‌న మిలిట‌రీ ధ్వంసం చేసిన దృశ్యాల‌ను యావ‌త్ ప్రపంచం తిల‌కించింది. బ్రహ్మోస్ మిస్సైల్ శ‌క్తికి పాక్‌ వణికిపోయింది” అని రాజ్‌నాథ్‌ తెలిపారు.

ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో పాకిస్థాన్‌కు చెందిన అనేక వైమానిక బేస్‌లు ధ్వంస‌మైన‌ట్లు చెప్పారు. బ్ర‌హ్మోస్ మిస్సైల్ శ‌క్తికి పాకిస్థాన్ వ‌ణికింద‌ని పేర్కొన్నారు. భార‌తీయ యుద్ధ విధానం, టెక్నాల మారిన‌ట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. న‌వ భార‌త సందేశాన్ని మీరు ఈ ప్ర‌పంచానికి చాటార‌ని కొనియాడారు.  

భార‌త్‌లో త‌యారీ అయిన ఆయుధాలు ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో మిలిట‌రీ శ‌క్తిగా మారిన‌ట్లు చెప్పారు. ధ్వంసం చేసిన ఉగ్రవాదుల మౌళిక స‌దుపాయాల‌ను పున‌ర్ నిర్మించే ప్ర‌క్రియ‌లో పాకిస్థాన్ ఉంద‌ని పేర్కొంటూ  ప్ర‌స్తుతం ఉన్న త‌రుణంలో పాకిస్థాన్‌కు ఎటువంటి ఆర్థిక సాయం చేసినా, అది టెర్ర‌ర్ ఫండింగ్‌తో స‌మాన‌మే అని ఆయ‌న స్పష్టం చేశారు. 

బిలియ‌న్ డాల‌ర్లు ఇచ్చిన అంశంపై ఐఎంఎఫ్ పున‌రాలోచ‌న చేస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఐఎంఎఫ్‌కు మేం ఇచ్చిన‌ నిధుల‌ను పాకిస్థాన్‌కు ఇవ్వ‌వ‌ద్దు అని, ఎందుకంటే ఆ నిధుల‌ను పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఏర్పాటు కోసం వాడుకుంటుంద‌ని రక్షణ మంత్రి ఆరోపించారు.

“దేశ సరిహద్దులు మీ(వాయుసేన) వల్ల పూర్తి సురక్షితంగా ఉన్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ అనే పేరు ప్రధాని నరేంద్రమోదీ పెట్టారు. మీరు (వాయుసేన) ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా దేశం లోపల, వెలుపల ఉన్న భారతీయులంతా గర్వపడేలా చేశారు. పాకిస్థాన్‌ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేయటానికి 23నిమిషాలు చాలని మీరు(వాయుసేన) చాటారు” అని కొనియాడారు. 

“మిగతా వారు బ్రేక్​ఫాస్ట్​ స్వీకరించటానికి తీసుకునే సమయంలో మీరు(వాయుసేన) శత్రువుల భరతం పట్టారు. మీరు(వాయుసేన) శత్రువుల భూభాగంలోకి వెళ్లి క్షిపణులు వేశారు. ఆ శబ్ధం సరిహద్దుల వరకే కాదు ప్రపంచమంతా వినిపించింది” అని చెప్పారు.

“నిన్ననే నేను శ్రీనగర్‌లో మన ధైర్యవంతులైన ఆర్మీ సిబ్బందిని కలిశాను. ఈరోజు నేను ఇక్కడ(భూజ్​ ఎయిర్​బేస్) వైమానిక యోధులను కలుస్తున్నాను. నిన్న ఉత్తర ప్రాంతంలోని మన జవాన్లను కలిసి, ఈరోజు నేను దేశంలోని పశ్చిమ ప్రాంతంలో వైమానిక యోధులను, ఇతర భద్రతా సిబ్బందిని కలుస్తున్నాను. రెండు వైపుల్లోనూ ఉత్సాహం, శక్తిని చూస్తున్నాను. ఆ ఉత్సాహాన్ని అనుభవిస్తున్నాను” అంటూ రక్షణ మంత్రి సంతోషం ప్రకటించారు. 

 
“మీరు భారతదేశ సరిహద్దులను భద్రపరుస్తారని నాకు బలమైన నమ్మకం ఉంది. ఇక బ్రహ్మోస్ క్షిపణి శక్తిని పాకిస్థాన్ కూడా అంగీకరించింది. మన దేశంలో ‘దిన్ మే తారే దేఖ్నా (పట్టపగలే చుక్కలు చూడటం)’ అనే పాత సామెత ఉంది. మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌కు- ‘రాత్ కే అంధేరే మే దిన్ కా ఉజాలా (రాత్రి చీకట్లో పగలు వెలుగు చూడటం)’ అని చూపించింది” అని రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు.