రక్షణకు బడ్జెట్‌లో మరో రూ.50 వేల కోట్లు పెంపు

రక్షణకు బడ్జెట్‌లో మరో రూ.50 వేల కోట్లు పెంపు
పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శాఖను మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తున్నది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు కేటాయించే బడ్జెట్‌ను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ‘ఆపరేష్‌ సిందూర్‌’  అనంతరం రక్షణ రంగానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన పద్దు కంటే రూ.50,000 కోట్ల మేర బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు చేపట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఇందుకోసం పార్లమెంట్ శీతాకాల సమావేశంలో రూ.50వేల కోట్లకు సంబంధించిన సప్లిమెంటరీ పద్దును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో రక్షణశాఖ కేటాయింపులు రూ.6.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వార్షిక పద్దులో 13 శాతం రక్షణ రంగానికే కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 9.53% ఎక్కువ. ఇప్పుడు అదనపు కేటాయింపులతో డిఫెన్స్‌కు కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. 
 
ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ బడ్జెట్‌లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ మేరకు ఆలోచన చేసినట్లు తెలిసింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 10 సంవత్సరాల్లో రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2014-15 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 2.29 లక్షల కోట్లు కేటాయించారు. అది ఈ ఏడాదికి రూ.6.81 లక్షల కోట్లకు చేరింది. 
 
తాజా నిర్ణయంతో రూ.7 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. అయితే, తాజా పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఆపరేషన్ సిందూర్​ విజయవంతమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 12న కీలక వ్యాఖ్యలు చేశారు.  “ఈ ఆపరేషన్ సమయంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలను ప్రపంచం గుర్తించింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆయుధాలపై విశ్వసనీయత పెరిగింది. 21వ శతాబ్దపు యుద్ధంలో మేడ్ ఇన్ ఇండియా రక్షణ పరికరాలకు టైమ్ వచ్చింది”అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు. 
 
ఈ నేపథ్యంలో దేశీయ రక్షణ ఉత్పత్తులను పెంచడంతో పాటు మరిన్ని అభివృద్ధి చేసే అంశంపై కేంద్రం దృష్టి సారించింది. గత పదేళ్లలో రక్షణ ఎగుమతులు దాదాపు పది శాతం పెరిగాయి. ఉత్పత్తులు పెంచడం ద్వారా భవిష్యత్​లో ఎగుమతులను పెంచుకునే యోచనలో మోదీ సర్కార్​ ఉన్నట్లు తెలుస్తోంది.