భారత్​లో చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలు బ్లాక్

భారత్​లో చైనా, టర్కీ మీడియా ఎక్స్ ఖాతాలు బ్లాక్
ఆపరేషన్‌ సిందూర్‌ వేళ దాయాది దేశానికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పలు అంతర్జాతీయ మీడియా సంస్థలపై భారత్‌ చర్యలకు ఉపక్రమించింది. ఒక పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసిన చైనా ప్రభుత్వ మీడియా సంస్థలైన గ్లోబల్‌ టైమ్స్‌, జిన్హువా ఎక్స్‌ ఖాతాను భారత్‌ నిలిపివేయగా, మరోవంక తుర్కియే పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్‌ టీఆర్‌టీ వరల్డ్‌ ను కూడా భారత్‌ బ్లాక్‌ చేసేసింది.

ఈ మేరకు ఈ వారం మొదటిలోనే బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం గ్లోబల్‌ టైమ్స్‌ను హెచ్చరించినట్లు తెలిసింది.  ఎక్స్‌లో పోస్టు చేసిన సమాచారాన్ని పున:పరిశీలించుకోవాలని, తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఎక్స్‌ ద్వారా హితవు పలికింది. 

పాకిస్థాన్‌కు సానుభూతి చూపే పలు ఎక్స్‌ ఖాతాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఎలాంటి ఆధారాలు లేకుండానే విచ్చలవిడిగా పోస్టులు చేస్తూ, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని భారత రాయబార కార్యాలయం మరో పోస్టులో వివరించింది.  బాధ్యతాయుతమైన మీడియా సంస్థలు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదని, అది జర్నలిస్ట్ విలువలను కాలరాయడమేనని పేర్కొంది.

కాగా, ఉగ్రవాదులు, వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ తీరును ప్రపంచదేశాలను సమర్థిస్తుంటే ఈ అంశంలో మాత్రం చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. చైనా అధికారిక మీడియా అయినా గ్లోబల్ టైమ్స్‌ పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేసినట్లు భారత్‌ గుర్తించింది. ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఆ సంస్థ ఎక్స్‌ అకౌంట్‌ను విత్‌హెల్డ్‌లో ఉంచింది.