ఏ అధికారిక పదవి చేపట్టను 

ఏ అధికారిక పదవి చేపట్టను 
పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పష్టం చేశారు. తాను న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్‌ ఖన్నా పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దాంతో తన ఆఖరి రోజు కోర్టులో బెంచ్‌ కార్యలాపాలు ముగియగానే సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. 
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జస్టిస్ యశ్వంత్ వర్మ వివాదానికి సంబంధించిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సంజీవ్ ఖన్నా సమాధామిస్తూ, జ్యూడిషియరీ అనేది సానుకూల, ప్రతికూల అంశాలను చూస్తుందని, హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ”మేము చేయాల్సి వచ్చినప్పుడు, నిర్ణయాలు తీసుకుంటాం. మనం చేసింది సరైనదా, కాదా? అనేది భవిష్యత్తు చెబుతుంది” అని పేర్కొన్నారు.
జస్టిస్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు మంగళవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజేఐ ఖన్నా పనితీరును బార్ సీనియర్ లాయర్లు ఈ సందర్భంగా ప్రశంసించారు. సీజేఐ నిర్ణయాలు ఎంతో ఆలోచనాత్మకంగా, మానవ హక్కులకు ప్రాధాన్యత ఇచ్చేవిగా ఉండేవని తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కొనియాడారు. 
“న్యాయవ్యవస్థ అనేది న్యాయమూర్తులు, బార్ రెండింటినీ సూచించే ఒక సాధారణ పదం. మీరు (బార్) వ్యవస్థలోని ఇతర తనిఖీల నుండి వేరుగా అంతర్నిర్మిత తనిఖీ. మీరు మనస్సాక్షిని కాపాడేవారు” అని సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. కోర్టులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి న్యాయమూర్తులు ఉన్నారని, “మేము విషయాలను చర్చించినప్పుడు, మీరు విభిన్న అంశాలను ఎత్తి చూపగలుగుతారు” అని ఆయన చెప్పారు. 
సీజేఐ తీర్పులన్నీ చాలా స్పష్టంగా, సరళతతో ఉండేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశంసించారు. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది నవంబర్ 11న జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు 2005లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 జనవరి 19న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, భారత 52వ సీజేఐగా బీఆర్ గవాయ్ మే 14న బాధ్యతలు చేపడతారు.